మహిళా ఎస్‌ఎస్‌సీలకు ఊరట – పూర్తి పెన్షన్‌కు అర్హత..
x

మహిళా ఎస్‌ఎస్‌సీలకు ఊరట – పూర్తి పెన్షన్‌కు అర్హత..

సుప్రీంకోర్టు కీలక తీర్పు


Click the Play button to hear this message in audio format

సాయుధ దళాల్లో పనిచేస్తున్న మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) అధికారులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు పూర్తి పెన్షన్ ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఈ కేసులో వింగ్ కమాండర్ సుచేత అదన్ సహా పలువురు మహిళా అధికారులు, శాశ్వత కమిషన్ (Permanent Commission) నిరాకరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టి్స్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

తీర్పులో మహిళా అధికారుల పనితీరు అంచనా (ACR – Annual Confidential Reports)లో లోపాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. శాశ్వత కమిషన్ ఇవ్వబోదనే ముందస్తు భావనతోనే వారి పనితీరును తక్కువగా అంచనా వేసినట్లు పేర్కొంది. దీని వల్ల వారి కెరీర్ పురోగతిపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది. వైమానిక దళంలో 2019లో అమలు చేసిన సర్వీస్ కాల పరిమితి, కనీస పనితీరు ప్రమాణాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

20 ఏళ్ల సేవగా పరిగణన..

రాజ్యాంగంలోని Article 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను వినియోగించిన సుప్రీంకోర్టు..2019, 2020, 2021లో జరిగిన సెలక్షన్ బోర్డుల్లో ఎంపికయిన మహిళా అధికారులను 20 ఏళ్ల సేవ పూర్తి చేసినట్లుగా పరిగణించాలని ఆదేశించింది. వారికి పూర్తి పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం 2025 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఈ తీర్పుతో సాయుధ దళాలలో పనిచేసే మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు పెద్ద ఊరట లభించింది. వారి సేవలకు తగిన గుర్తింపు, సమాన హక్కులు కల్పించే దిశగా ఇది కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

Read More
Next Story