ఉప వర్గీకరణపై సుప్రీం తీర్పు.. ఎవరు ఏమన్నారంటే..
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది.
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఈ కేసు విషయంలో సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల బెంచ్ 6:1తో సంచలన తీర్పునిచ్చింది. ఎస్సీ సామాజిక వర్గంలో మరింత వెనకబడిన వారికి ఉపవర్గీకరణ ద్వారా ప్రత్యేక కోటా కేటాయించడం అనుమతించదగిన అంశమేనని బెంచ్ తేల్చింది. అయితే ఉపవర్గీకరణ పేరుతో రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయి రిజర్వేషన్లను ఒక ఉప కులానికి అందివ్వలేదని, దాంతో పాటుగా ఉపవర్గీకరణకు సంబందించి పూర్తి సమాచారంతో తన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వివరించింది.
కాగా ఈ కేసు విచారణలో 2004లోని ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును కొట్టేశారు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా తన బెంచ్‌లోని ఆరుగురు సభ్యులు తీర్పునిచ్చారని సీజేఐ చంద్రచూడ్ వివరించారు. కాగా ఎస్సీ రిజర్వేషన్‌ల ఉపవర్గీకరణను జస్టిస్ బేటా త్రివేది వ్యతిరేకించారు. దాంతో ఈ కేసులో తీర్పు 6:1గా మారింది. ఈ విచారణలో ఏడుగురు సభ్యుల బెంచ్ ముఖ్యంగా రెండు విషయాలపై దృష్టి సారిస్తోంది. వాటిలో మొదటిది.. రిజర్వ్‌డ్ కులాల ఉపవర్గీకరణను అనుమతించాలి వద్దా అని. రెండవది.. 2004 ఈవీ చిన్నయ్య కేసులో వెలువడిన తీర్పులో వాస్తవికత, కరెక్ట్‌నెస్‌ను పరిశీలించడం. ఈ తీర్పు ప్రకారం.. ఎస్సీలను ఆర్టికల్ 341 కింద ఒక ప్రాంతీయ వర్గంగా భావించాల్సి ఉంటుంది. ఆ కారణంగా ఎస్సీని వర్గీకరించడం సాధ్యపడదు అని పేర్కొంది. ఈ రెండు అంశాలను సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసుపై మూడు రోజులపై వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవై, విక్రమ్ నాథ్, బెలా త్రివేది, పంకజ్ మిథల్, మనోజ్ మిశ్రా, సతిష్ చంద్ర శర్మ కూడిన బెంచ్ తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పునే ఈరోజు వెలువరించింది.
ఉపవర్గీకరణ ఆర్టికల్ 14, 341ని అతిక్రమించదు: సీజేఐ
ఈ సందర్బంగా సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు వెలువరుస్తున్న తీర్పు ఎంతో చారిత్రాత్మకమైనది. ఈ తీర్పు షెడ్యూల్డ్ కులాలు అనేవి సజాతీయ వర్గానికి చెందినవి కాదు అనడానికి ఒక ఆధారం. ఉప వర్గీకరణ ప్రక్రియ రాజ్యంగంలోని ఆర్టికల్ 14 కింది సమానత్వపు సూత్రాన్ని, ఆర్టికల్ 341(2)ను అతిక్రమించదు. అదే విధంగా ఉపవర్గీకరణ చేయడం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుకునేలా ఆర్టికల్ 15, 16లో కూడా ఏమీ లేదు’’ అని ఆయన వివరించారు. ‘‘ఉపవర్గీకరణను లెక్కించదగిన, ప్రదర్శించదగిన సమాచారంతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలవు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఇష్టానుసారంగా ఉపవర్గీకరణను చేపట్టలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయ సమీక్ష ద్వారా సవరించబడుతుంది’’ అని చంద్రచూడ్ చెప్పారు.
అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత: బీఆర్ గవై
మరింత వెనకబడిన వర్గాల ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని జస్టిస్ బీఆర్ గవై తన తీర్పులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొందరు మాత్రమే రిజర్వేషన్లను ఆస్వాధిస్తున్నారని, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలలోనే శతాబ్దాల తరబడి అత్యధిక అణచివేతకు గురైన వర్గాలు ఉన్నాయని వివరించారు. ‘‘ఈవీ చిన్నయ్య కేసు తీర్పులో ఒక బేసిక్ తప్పు ఉంది. ఆర్టికల్ 341ను రిజర్వేషన్ బేసిస్‌గా పరిగణించడమే ఆ తప్పు. ఆర్టికల్ 341 అనేది కేవలం రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. పెద్ద వర్గంలోని ఒక చిన్న ఉపవర్గం అధిక అణచివేతను ఎదుర్కోవడమే ఉపవర్గీకరణకు ప్రధాన కారణం’’ అని వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉండే పైపై వారిని నిశ్చయాత్మక చర్యల నుంచి తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, అప్పుడే అసలైన సమానత్వం సాధించగలమని పేర్కొన్నారు. గవై చేసిన ఈ వ్యాఖ్యలతో జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా ఏకీభవించారు.
అదే విధంగా రిజర్వేషన్ అనేది ఒక తరానికి పరిమితం కావాలని జస్టిస్ పంకజ్ మిథల్ అన్నారు. ఒక జనరేషన్ రిజర్వేషన్‌ల ద్వారా ఉత్తమస్థాయికి చేరితే ఆ తర్వాత తరానికి రిజర్వేషన్‌లు కల్పించకూడదు అని మిథల్ వివరించారు. ఈ అంశాన్ని జస్టిస్ సతీష్ శర్మ కూడా సమర్థించారు.
షెడ్యూల్డ్ కులాల జాబితాను మార్చలేం: త్రివేది
ఈ కేసు విచారణలో కులాల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు అని తీర్పునిచ్చిన న్యాయమూర్తి జస్టిస్ త్రివేది. రిజవర్వేషన్లలో కోటాలు అందించడాన్ని త్రివేది తిరస్కరించారు. ఆర్టికల్ 341 కింద నోటిఫై చేయబడిన షెడ్యూల్డ్ కులాల ప్రెసిడెన్షియల్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవు, వాటికి ఆ అధికారం లేదు అని త్రివేది వివరించారు. ఈ జాబితాలో కులాలను చేర్చడం లేదా తొలగించడం అనేది పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఇందులో ఉపవర్గీకరణ చేయడం ప్రెసిడెన్షియల్ జాబితాను టింకరింగ్ చేయడమే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకుండా తొలగించడమే ఆర్టికల్ 341 ఉద్దేశం. ఉపవర్గీకరణ అనేది ఒకే వర్గంలోని ఒక తరగతికి లభించే ప్రయోజనాలను ఇతర తరగతులు కోల్పేయేలా చేస్తుందని త్రివేది వివరించారు.
కార్యనిర్వాహక లేదా శాసన అధికారాలు లేని సమయంలో కులాలను ఉపవర్గీకంచడంతో వారికి లభించే ప్రయోజనాలను వర్గీకరించే అర్హత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ఇలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించడం ద్వారా అధికార వర్గీకరణను అనుమతించినట్లే అవుతుందని వివరించారు.