అస్సాం సీఎం వీడియోపై పిటీషన్లను తిరస్కరించిన సుప్రీం
x

అస్సాం సీఎం వీడియోపై పిటీషన్లను తిరస్కరించిన సుప్రీం

వివాదాస్పద వీడియోపై గౌహతి హైకోర్టును సంప్రదించాలని దాఖలైన పిటిషన్లకు సూచించిన అత్యున్నత న్యాయస్థానం..


Click the Play button to hear this message in audio format

అస్సాం ముఖ్యమంత్రి‌పై వైరల్ అయిన ‘షూటింగ్ వీడియో’ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషనర్లు తమ ఫిర్యాదులతో గౌహతి హైకోర్టును సంప్రదించాలని సూచించింది.

ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు వ్యాఖ్యానిస్తూ ..“ప్రతి విషయం నేరుగా సుప్రీంకోర్టుకే రావడం ఆందోళనకర ధోరణి. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలి” అని తెలిపింది. ఎన్నికల ముందు రాజకీయ నేతలు, పార్టీలు సంయమనం పాటించాలని, రాజ్యాంగ నైతిక విలువలు దాటకూడదని కూడా సూచించింది.

అదే సమయంలో ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కోరింది. విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తూ.. అస్సాం ముఖ్యమంత్రి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, అలవాటైన నేరస్తుడిగా చూడాలని కోర్టును కోరారు. మరోవైపు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు ద్వేషపూరిత ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ పిటిషన్లు వేశారు.

వివాదానికి కారణమైన వీడియోను అస్సాం బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి రైఫిల్‌తో ఇద్దరిపై గురిపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు కనిపించడంతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం బీజేపీ ఆ పోస్టును తొలగించింది.

పిటిషనర్లు రాష్ట్ర లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. అలాగే, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు విభజన వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకోకుండా, సంబంధిత హైకోర్టే ఈ అంశాన్ని పరిశీలించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం గౌహతి హైకోర్టు ముందుకు వెళ్లే అవకాశముంది.

Read More
Next Story