చనిపోయిన కన్నతండ్రిని గౌరవంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ కొడుకు దగ్గర ఉన్నది కేవలం గుండె నిండా దుఃఖం. జేబులో చూస్తే చిల్లిగవ్వ లేదు. ఆసుపత్రిలో ప్రభుత్వ వాహనం దొరకలేదు. ప్రైవేటు ఆటోవాడు అడిగిన రెండు వేల రూపాయలు ఇచ్చుకోలేక ఆ నిస్సహాయ కొడుకు చేసిన సాహసం చూస్తే రాతి గుండె కూడా కరిగిపోవాల్సిందే. విధి ఆడిన వింత నాటకంలో ప్రాణం పోయిన తండ్రిని బైక్‌పై ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని, 13 కిలోమీటర్ల మేర ఆ పసివాడు సాగించిన మహాప్రస్థానం బాపట్ల జిల్లాలోనే కాదు, యావత్ సమాజం తలదించుకునేలా చేసింది. మన వ్యవస్థలోని డొల్లతనాన్ని, పేదవాడి బతుకు భారానికి అద్దం పట్టిన ఈ గుండెకోత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది.
రూ. 2,000 లేక.. బైక్‌పైనే మహాప్రస్థానం
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్వరరావు (55) అనే వ్యక్తి మంగళవారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశతో కుటుంబ సభ్యులు ఆయన్ను బైక్‌పైనే బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరణవార్త విన్న దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం పెద్ద భారమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను తరలించే మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు. ప్రైవేటు ఆటోలను ఆశ్రయిస్తే వారు రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు డిమాండ్ చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం వద్ద అంత డబ్బు లేకపోవడంతో, విధిలేక తండ్రి శవాన్ని బైక్‌పై ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్ల మేర ప్రయాణించి స్వగ్రామానికి తీసుకెళ్లారు.
నిర్లక్ష్యమా? నిస్సహాయతా?
ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం, అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. కూలి పనులు చేసుకుని జీవించే యానాది సామాజిక వర్గానికి చెందిన ఈ కుటుంబానికి ఆసుపత్రి వర్గాలు గానీ, ఇతర యంత్రాంగం గానీ కనీసం సాయం చేయలేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఆసుపత్రి వర్గాలేమో మా దృష్టికి తెస్తే సాయం చేసేవారమని అంటుంటే.. పేదలు ఆ సమయంలో ఎవరిని బ్రతిమలాడాలో తెలియని స్థితిలో ఉండటం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
స్పందించిన అధికార యంత్రాంగం
ఈ ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ స్పందించారు. బాపట్ల ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం మహాప్రస్థానం వాహనం లేదని, దాని ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అయితే, ప్రతిపాదనలు పంపాం అనే సమాధానం మరణించిన ఆ తండ్రికి, ఆ నిస్సహాయ కొడుకు పడ్డ వేదనకు ఊరటనివ్వలేకపోయింది.
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామన్న నినాదాల మధ్య.. కనీసం మనిషి చనిపోతే శ్మశానానికి తరలించేందుకు కూడా డబ్బుల్లేని దుస్థితి ఏపీలో పేదల కడగండ్లకు నిదర్శనం. ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవడం ఒక ఎత్తయితే, నిరుపేదలకు అండగా నిలవాల్సిన మానవత్వం మృగ్యం కావడం మరో ఎత్తు.