వామ్మో.. విశాఖ నుంచి తిరుపతికి రూ.5వేలా! సీఎం సార్, ఇదేంటో చూడండి!!
x

వామ్మో.. విశాఖ నుంచి తిరుపతికి రూ.5వేలా! సీఎం సార్, ఇదేంటో చూడండి!!

ప్రైవేటు బస్సుల నిలువు దోపిడీ.. ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ 9281607001 ఏర్పాటు


విశాఖలో బీచ్ ఫెస్టివల్, పిఠాపురంలో సంక్రాంతి ఫెస్టివల్, విజయవాడలో ఆవకాయ ఫెస్ట్.. నెల్లూరులో ఫ్లెమింగ్ ఫెస్టివల్.. తిరుపతిలో వెంకన్న వైభోగం.. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి తెచ్చిన శోభ ఇది. దీనికి తోడు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పల్లెలు కళకళలాడుతున్నాయి. కానీ అక్కడికి చేరుకునేందుకు ప్రయాణికులు పడుతున్న అవస్థలే వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రధానంగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే రహదారులపై రద్దీ తారాస్థాయికి చేరింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు బస్ ఆపరేటర్లు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా ఆర్టీఏ అధికారులు నిశ్చేష్టులై చూస్తున్నారే తప్ప కట్టడి చేయడంలో విఫలమైనట్టు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు ఏపీఎస్ ఆర్టీసీ చార్జీ రూ.650 అయితే ప్రైవేటు ఆపరేటర్లు 2000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు విశాఖకు చెందిన ప్రయాణీకుడు రామకోటేశ్వరరావు తెలిపారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (NH-65) శనివారం ఉదయం నుంచే వాహనాలతో కిటకిటలాడుతోంది. పంతంగి, చౌటుప్పల్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ, వాహనాల సంఖ్య విపరీతంగా ఉండటంతో దాటడానికి గంటల సమయం పడుతోంది.
ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. గుంటూరు, ఒంగోలు వెళ్లే వారు సాగర్ హైవే వైపు వెళ్లాలని సూచించారు.
విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని సూచించారు.
బస్టాండ్లలో బీభత్స దృశ్యాలు
ప్రభుత్వ బస్సులు, రైళ్లలో ఎక్కడా ఖాళీ లేకపోవడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీట్ల కోసం కుస్తీపడుతున్నారు. బస్టాండుల్లో విద్యార్థులు సీట్ల కోసం కిటికీల గుండా లోపలికి వెళ్లడం వంటి ప్రమాదకర ప్రయత్నాలు చేస్తున్నారు.
బస్సు ఆగకముందే ఎక్కేందుకు ప్రయత్నిస్తుండటంతో వృద్ధులు, పిల్లలు కిందపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రైవేటు ట్రావెల్స్ 'దోపిడీ'..
పండుగ రద్దీని ప్రైవేట్ ఆపరేటర్లు కాసుల వర్షంగా మార్చుకుంటున్నారు. మామూలు రోజుల్లో కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. భోగికి ముందే ఈ చార్జీలు ఇలా ఉండే ఆరోజుకు ఎంతకి చేరతాయోనని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా ఫిట్‌నెస్ లేని పాత బస్సులను కూడా రోడ్లపైకి తెస్తున్నారు, ఇది ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నా జనం ఊళ్లకి వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
రవాణా శాఖ హెచ్చరికలు...
అధిక చార్జీల వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఆర్టీసీ ధర కంటే 50 శాతం మించి వసూలు చేయకూడదని నిబంధన విధించారు.

విశాఖ నుంచి విజయవాడకు రూ.2000, అమలాపురానికి 1500, కడపకి 3500, హైదరాబాద్ కి 3500, బెంగళూరుకి 5వేలు వసూలు చేస్తున్నట్టు ఆర్టీఏకి ఫిర్యాదు అందాయని రవాణా శాఖ విశాఖ రీజియన్ కమిషనర్ సునీల్ సిన్హా తెలిపారు.
ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేసినా లేదా ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయడానికి 92816 07001 నంబరును అందుబాటులో ఉంచారు.
రవాణా శాఖ కమిషనర్ ఏమన్నారంటే..
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని సంయుక్త రవాణా కమిషనర్ ఎ. మోహన్ స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా స్థానిక డీటీసీ కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించి విస్తృత తనిఖీలు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ప్రయాణికులు సాధ్యమైనంత వరకు అధికారిక రవాణా మార్గాలను ఎంచుకోవాలని, ప్రైవేట్ వాహనాల్లో అధిక ధరలు ఉంటే వెంటనే రవాణా శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
Read More
Next Story