
విజయవాడ వెస్ట్ బైపాస్ (ఊహాచిత్రం)
కాజా దగ్గర రోడ్డెక్కితే నేరుగా అటు హైదరాబాదు, ఇటు ఏలూరు!
విజయవాడ నగరంలోకి రాకుండానే.. నిముషాల్లో గమ్యానికి!
విజయవాడ సిటీలోకి వెళ్లే అవసరం లేకుండా విజయవాడ వెస్ట్ బైపాస్ పై వాహనాల రాకపోకలను జనవరి 15 (గురువారం) నుంచి ట్రయల్ రన్‌గా వాహనాలను అనుమతిస్తున్నారు. నేషనల్ హైవే అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేశారు. ట్రయల్ రన్ కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలను బైపాస్‌పై రాకపోకలకు అనుమతిస్తారు. బుధవారం ఉదయం బైపాస్‌ను అధికారులు పరిశీలించారు. గురువారం నుంచి వాహనాలను అనుమతించేందుకు సిద్ధమయ్యారు.
ఈ బైపాస్ తో ఉపయోగమేమిటంటే...
1. గుంటూరు/చెన్నై వైపు నుంచి ఏలూరు/విశాఖపట్నం వెళ్లే వారికి..
మీరు గుంటూరు వైపు నుంచి వస్తుంటే, విజయవాడ నగరంలోకి (కనకదుర్గ వారధి వైపు) వెళ్లాల్సిన పనిలేదు.
ఎక్కడ ఎక్కాలి: కాజా టోల్‌గేట్ దాటిన వెంటనే పశ్చిమ బైపాస్ రోడ్డులోకి ప్రవేశించండి.
మార్గం: అక్కడ నుంచి నేరుగా గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు ప్రయాణించవచ్చు.
ఎక్కడ కలవాలి: చిన్నఅవుటపల్లి వద్ద మీరు నేరుగా ఏలూరు వైపు వెళ్లే మెయిన్ హైవేలోకి కలిసిపోవచ్చు. దీనివల్ల గన్నవరం, రామవరప్పాడు ట్రాఫిక్ తప్పుతుంది.
2. గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి..
గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇది చాలా సులువైన మార్గం.
ఎక్కడ ఎక్కాలి: కాజా టోల్‌గేట్ దాటాక పశ్చిమ బైపాస్‌లోకి ప్రవేశించండి.
ఎక్కడ దిగాలి: ఈ బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తూ గొల్లపూడి వద్ద దిగాలి.
లింక్ రోడ్డు: గొల్లపూడి వద్ద మీరు నేరుగా విజయవాడ - హైదరాబాద్ హైవే (NH-65) లోకి చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు.
గమనిక: తిరుగు ప్రయాణం చేసే వారికి (ముఖ్య సూచన)
ప్రస్తుతానికి ఈ మార్గం వన్ వే (One-way) మాత్రమే.
గొల్లపూడి నుంచి కాజా వైపు: గొల్లపూడి నుంచి కాజా (గుంటూరు) వైపు వచ్చే వాహనాలకు ఈ బైపాస్‌లో ఇంకా అనుమతి లేదు (కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి).
ప్రత్యామ్నాయం: గొల్లపూడి నుంచి వచ్చే వారు కృష్ణా నది వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత.. మంగళగిరి - మందడం రోడ్డు ద్వారా సచివాలయం, హైకోర్టు మీదుగా గుంటూరు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ఏయే వాహనాలను అనుమతిస్తారంటే...
టూ వీలర్స్, కార్లు, బస్సులు, లారీలు.. ఇలా అన్ని రకాల వాహనాలకు అనుమతి ఉంది.
ప్రయోజనం: విజయవాడ సిటీలో ట్రాఫిక్ జామ్స్ తప్పుతాయి. ప్రయాణ సమయం కనీసం 30 నుండి 45 నిమిషాలు ఆదా అవుతుంది.
Next Story

