ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
x

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయి ప్రసాద్ శనివారం ఏపీ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్‌గా పనిచేసిన కె. విజయానంద్ శనివారం పదవీ విరమణ చేయడంతో, ఆయన నుంచి సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11:33 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు.


అధికారులు, సంఘాల శుభాకాంక్షలు

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, ఎం.టి. కృష్ణ బాబు, బి. రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, ముఖేష్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే సహా పలువురు కార్యదర్శులు, శాఖాధిపతులు సాయి ప్రసాద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.

అపార అనుభవం కలిగిన అధికారి
1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు. 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. విద్యుత్ రంగంలో విశేష అనుభవం ఉన్న ఆయన ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్ సంస్థలకు సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు.

కీలక పదవుల్లో ప్రస్థానం
సాయి ప్రసాద్ గతంలో ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా, కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. అనంతరం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా, సీసీఎల్‌ఏగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పరిపాలనా పదవి అయిన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
Read More
Next Story