
కుంకుమ పూవు తోట (ఇన్ సెట్ లో ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ)
పీపీపీలో శాఫ్రాన్ సాగుతో గిరిజనులకు హాని!
శాఫ్రాన్ సాగుకు ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తే గిరిజనుల సంక్షేమానికి హాని జరుగుతుందని ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్) జిల్లా లంబసింగి ప్రాంతంలో పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో శాఫ్రాన్ (కుంకుమ పువ్వు) పంటను ప్రవేశ పెట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు పత్రికల్లో చూశానని ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. అదే జరిగితే గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాశ్మీర్‌లో ఇలాంటి నిర్ణయం వల్లే అక్కడ శాఫ్రాన్ ఉత్పత్తి తగ్గిపోయిందని గుర్తు చేశారు. దీనిపై శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు లేఖ రాశారు. లేఖలోని సారాంశం యధాతథంగా..
గ్రామసభల అనుమతి తప్పనిసరి..
‘షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కాని, పథకాన్ని గాని చేపట్టే ముందు పీసా చట్టానికి అనుగుణంగా స్థానిక గిరిజనులతో గ్రామసభల ముందు ఆ ప్రతిపాదనను ప్రవేశపెట్టి ముందస్తు అనుమతి తీసుకోవడం అవసరం. గిరిజనులకు తగిన శిక్షణ ఇస్తే వారంతట వారే వారికి లాభం కలిగేలా కొత్త వ్యవసాయ పద్ధతులను చేపట్టగలుగుతారు. తద్వారా లాభాలను ఆర్జించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు సమతా కేసులో 11–7–97లో ఇచ్చిన తీర్పు ఆధారంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీలను ప్రవేశపెట్టడం నిషేధం. అధిక పెట్టుబడులు పెట్టి సాఫ్రాన్ వంటి వాణిజ్య పంటలను పండించి గిట్టుబాటు ధరలకు అమ్మడంలో ఇతర ప్రాంతాల్లో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించాలి.
కాశ్మీర్‌లో క్షీణించిన సాఫ్రాన్ ఉత్పత్తి..
ఉదాహరణకు కాశ్మీరులో ఇలాంటి సమస్యల కారణంగా శాఫ్రాన్ ఉత్పత్తి గత పదేళ్లుగా 68 శాతం తగ్గి శాఫ్రాన్ పంటను పండించిన రైతులు నష్టపోయారు. షెడ్యూల్డ్ (గిరిజన) ప్రాంతాల్లో ఇలాంటి ప్రతిపాదనలను తలపెట్టే ముందు ప్రభుత్వం పీసా చట్టాన్ని గౌరవించి స్థానిక గ్రామ సభల ముందస్తు అనుమతి తీసుకోవాల’ని నా విజ్ఞప్తి’ అని ఈఏఎస్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.
Next Story

