అమరావతిలో కొలువుదీరిన ’త్యాగ శిల్పం‘
x

అమరావతిలో కొలువుదీరిన ’త్యాగ శిల్పం‘

పొట్టి శ్రీరాములు చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు.


తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు అమరావతిలో మిన్నంటాయి. రాజధాని పరిధిలోని శాఖమూరు (తుళ్లూరు)లో ఏర్పాటు చేసిన ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. అమరజీవి చేసిన 58 రోజుల అలుపెరుగని పోరాటానికి ప్రతీకగా, సరిగ్గా 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించడం విశేషం. దీనిని ’అమరజీవి-త్యాగ శిల్పం‘ (Statue of Sacrifice)గా నామకరణం చేశారు.

తరలివచ్చిన నేతలు.. ఘన నివాళులు
ఈ చారిత్రాత్మక వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అమరజీవి విగ్రహం వద్ద నేతలంతా పుష్పాంజలి ఘటించి, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన బలిదానాన్ని స్మరించుకున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబడిన తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోనుంది.
రికార్డు కాలంలో నిర్మాణం.. ఇంజనీరింగ్ అద్భుతం
శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ప్రభుత్వం కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం (Bronze), 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. రెండో దశలో ఇక్కడ ఒక అత్యాధునిక మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే స్మృతివనంగా తీర్చిదిద్దబడుతోంది.
మహనీయుని ఆశయాలే బాట : చంద్రబాబు, లోకేష్
తెలుగు వారి కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తిదాయకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ఆయన జీవితం పోరాటాలకు నిలయమన్నారు. అటు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన పొట్టి శ్రీరాములు, సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
Read More
Next Story