రూ. 6 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
x

రూ. 6 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

కృష్ణా జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.


అసలుకు నకలు.. రూ. 30 వేలకే లక్ష రూపాయల దొంగ కరెన్సీని ఆశ చూపిస్తూ సంక్రాంతి సందడిని ఆసరాగా చేసుకుని మార్కెట్‌ను ముంచేయాలని చూసిన ఓ నకిలీ నోట్ల ముఠా ఆట కట్టించారు కృష్ణా జిల్లా పోలీసులు. కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఒక వైన్ షాపులో చిన్న క్లూతో మొదలైన ఈ ఆపరేషన్, పెందుర్తిలోని ఓ రహస్య డెన్ వరకు సాగింది. రూ. 6 లక్షల నకిలీ నోట్లు, ప్రింటింగ్ మెషీన్లతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

వైన్ షాపులో దొరికిన నకిలీ క్లూ

ఈ ముఠా భాగోతం కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఒక వైన్ షాపు వద్ద బయటపడింది. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు దొంగనోట్లు ఇవ్వగా, అనుమానం వచ్చిన షాపు నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేట మొదలుపెట్టారు.

సాంకేతిక ఆధారాలతో కోకవణిపాలెం డెన్ పై దాడి

సీసీ టీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు రంజిత్ సింగ్, బ్రహ్మ ఉమా శంకర్, దిలీప్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు పెందుర్తి మండలం కోకవణిపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని రహస్యంగా నకిలీ నోట్ల ముద్రణ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

రూ. 30 వేలకే లక్ష రూపాయల నోట్లు

నిందితులు అనుసరిస్తున్న తీరు పోలీసులనే విస్మయానికి గురిచేసింది. రూ. 30 వేల అసలు కరెన్సీ ఇస్తే, బదులుగా రూ. 1 లక్ష నకిలీ నోట్లను ఈ ముఠా సరఫరా చేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని భారీగా నోట్లను మార్కెట్లోకి వదిలారు. జనసంచారం ఎక్కువగా ఉండే వైన్ షాపులు, పెట్రోల్ బంకుల్లో ఈ నోట్లను చలామణి చేసేందుకు ప్లాన్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బంటుమిల్లి కోర్టులో హాజరుపరిచారు.

Read More
Next Story