
సునీల్ నాయక్ బీహార్ ఐజీ
RRR CASE: సునీల్ నాయక్ అరెస్ట్ పై మొబైల్ కోర్టు ట్విస్ట్
అరెస్ట్ వారెంట్ జారీ చేసిన మొబైల్ కోర్టు, పాట్నాలోనే మకాం వేసిన ఏపీ పోలీసులు
బిహార్ ఐజీ (అగ్నిమాపక శాఖ) అధికారి సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణ కేసులో గుంటూరులోని మొబైల్ కోర్టు గురువారం ఈ వారెంట్ జారీ చేసింది.
విచారణ కోసం గుంటూరు పోలీసులు ఇచ్చిన నోటీసులపై సునీల్ నాయక్ స్పందించకపోవడంతో అతడిని అరెస్టు చేసేందుకు ఇటీవల ఎస్పీ దామోదర్ బృందం బిహార్ రాజధాని పాట్నాకు వెళ్లింది. అయితే ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు అక్కడి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో గుంటూరు మొబైల్ కోర్టులో పోలీసులు అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేశారు.
పాట్నాలో హైడ్రామా నుంచి ఏపీ హైకోర్టు వరకు..
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన కస్టడీ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ క్యాడర్‌కు చెందిన ఐజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ప్రయత్నం పాట్నాలో ఉత్కంఠకు దారితీసింది. చివరకు కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట లభించగా, ప్రస్తుతం ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలో గుంటూరు మొబైల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం గమనార్హం.
ఏమిటీ కేసు? నేపథ్యం ఇదే..
2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదైంది. ఆ సమయంలో సీఐడీ కస్టడీలో ఉన్న తనను అధికారులు తీవ్రంగా హింసించారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఆరోపించారు.
అప్పట్లో సునీల్ నాయక్ ఏపీలో ఇంటర్ కేడర్ డెప్యుటేషన్‌పై సీఐడీ డీఐజీగా పని చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రఘురామ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సునీల్ నాయక్ సహా పలువురు పోలీసు అధికారులపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
పాట్నాలో హైడ్రామా: గోడ దూకిన పోలీసులు!
సోమవారం తెల్లవారుజామున 5:53 గంటలకు ఏపీ పోలీసులు పాట్నాలోని సునీల్ నాయక్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీ పోలీసులు వారెంట్ లేకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఐజీ నివాస ప్రాంగణంలోకి గోడ దూకి వెళ్లారు. తెల్లవారుజామునే గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హోంగార్డులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చి ఏపీ పోలీసులను చుట్టుముట్టారు.
సుమారు ఏడు గంటల పాటు రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చట్టపరమైన వాదనలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏపీ పోలీసులు చివరకు స్థానిక శాస్త్రీ నగర్ పోలీసుల సహాయం కోరారు.
కోర్టులో చుక్కెదురు..
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు పాట్నా సివిల్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ కోరారు. అయితే స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. సరైన వారెంట్, కేస్ డైరీ సమర్పించకపోవడంతో కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఉపశమనం: సునీల్ నాయక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూనే, 30 రోజుల్లోపు సంబంధిత కోర్టు నుంచి ఉపశమనం పొందాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈలోపు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఐజీ
పాట్నాలో అరెస్ట్ నుంచి తప్పించుకున్న వెంటనే సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, తనకు కస్టడీ హింసతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదించారు. మొదట ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని, తర్వాత కావాలనే చేర్చారని పేర్కొన్నారు. ఘటన సమయంలో తాను ఉన్నట్లు సాక్షులు చెప్పారే తప్ప, తాను రఘురామను హింసించినట్లు ఎక్కడా లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇప్పటికే బెయిల్ నిరాకరించినందున, తక్షణమే మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన హైకోర్టును కోరారు.
ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసేందుకు మరో రాష్ట్ర పోలీసులు వెళ్లడం, అక్కడ స్థానిక దళాల నుంచి వ్యతిరేకత రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
సునీల్ నాయక్ తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. మద్రాసు ఐఐటీ విద్యార్థి. డీఆర్డీఏ శాస్త్రవేత్తగా పని చేస్తూ సివిల్స్ కి ఎంపికయ్యారు. బీహార్ క్యాడర్ ఐపీఎస్. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం సరిగా లేదనే పేరిట 2020లో ఏపీకి బదిలీ అయ్యారు. 2021లో రఘురామ కృష్ణరాజు కేసులో ఇరుక్కున్నారు.
Next Story

