
రౌడీల దాష్టీకంలో గాయపడిన వ్యక్తిని పరామర్శిస్తున్న పోలీసులు
బెజవాడ రౌడీ…ప్రశ్నించారో తంతారు వెంటబడి!??
బబ్బూరి గ్రౌండ్స్ లో రెచ్చిపోయిన రౌడీలు, ముగ్గురికి గాయాలు
బెజవాడ నగరంలో రౌడీషీటర్లు మళ్లీ రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారిపై కారు ఎక్కించి, తొక్కించి బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో జరిగిన ఈ ఘటనలో నలుగురు గాయపడగా, పదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ప్రజా భద్రతపై మాత్రమే కాదు, చట్టపాలనపై కూడా తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. రౌడీషీటర్ల పీచమణుస్తామని నగర పోలీసు కమిషనర్ హెచ్చరించారు.
పిల్లలు తిరిగే చోటే రౌడీ బీభత్సం
ఆదివారం సాయంత్రం పున్నమిఘాట్–బబ్బూరి గ్రౌండ్స్ పరిసరాల్లో పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా, దినేష్‌తో పాటు వారి స్నేహితులు భార్గవ్, మహేష్ కలిసి కారులో అతివేగంగా రౌండ్లు వేస్తున్నారు. చిన్న పిల్లలు తిరుగుతున్న ప్రదేశంలో ఇలా డ్రైవింగ్ చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నించగా, కారులో నుంచి దిగిన చిన్న చిచ్చా “నేనెవరినో తెలుసా? రౌడీని” అంటూ బెదిరించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
అంతలో కారును ముందుకు దూసుకెళ్లిన పెద్ద చిచ్చా, రహదారి పక్కన ఉన్న వారిపైకి వాహనాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో పదేళ్ల రిహాన్ ఖాన్, మీడియా ప్రతినిధి నాగేంద్రతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఐస్‌క్రీం తినేందుకు తండ్రితో కలిసి వచ్చిన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రౌడీషీట్ ఉన్నవాళ్లే… అయినా అడ్డుకట్ట లేదు
ఈ ఘటనలో నిందితులు కొత్త నేరస్తులు కాదు. పెద్ద చిచ్చా, చిన్న చిచ్చాలపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో, దినేష్‌పై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే రౌడీషీట్లు ఉన్నాయి. అయినా బహిరంగ ప్రదేశాల్లో మద్యం మత్తులో తిరుగుతూ, నగర మధ్యలో రౌడీ ప్రదర్శన చేయగలగడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.
రౌడీల దాడిలో గాయపడిన బాలుడు
రౌడీషీట్ అంటే పర్యవేక్షణా? లేక కేవలం పోలీస్ రికార్డులకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఈ ఘటనతో మళ్లీ ముందుకు వచ్చాయి.
సీసీ కెమెరాల తర్వాతే పోలీసింగ్?
ఘటన అనంతరం పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కారును ట్రాక్ చేసి, రాత్రి 11 గంటల సమయంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్న చిచ్చా, భార్గవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
అయితే ఇది నేరం జరిగిన తర్వాత తీసుకున్న చర్య మాత్రమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేరం జరగకముందే రౌడీషీటర్లను కట్టడి చేసే వ్యవస్థ ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది.
ప్రభుత్వం ఏది మరి?
ప్రభుత్వం ఒకవైపు పబ్లిక్ సేఫ్టీ, రోడ్డు భద్రత, కఠిన చర్యలు అని చెబుతున్న వేళ, మరోవైపు పిల్లలు తిరిగే ప్రాంతాల్లో రౌడీషీటర్లు మద్యం మత్తులో బీభత్సం సృష్టించడం సర్కార్ కే సవాల్ విసిరినట్టయిందని సీపీఐ రాష్ట్ర నాయకులు వనజ అన్నారు.
ప్రశ్నించినందుకే కారు ఎక్కించి బలి చేయాల్సి వస్తే, నగరంలో సామాన్య పౌరుడి భద్రత ఎక్కడ ఉందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న అభిప్రాయాన్ని పౌరహక్కుల సంఘం నాయకుడు ఎం.శేషగిరి వ్యక్తం చేశారు.
బెజవాడ ఘటన ఒక రోడ్డు ప్రమాదం కాదు. రౌడీషీటర్లు ప్రభుత్వానికి భయపడటం మానేశారన్న సంకేతం ఈ ఘటనతో బట్టబయలైందని విమర్శలను పోలీసు కమిషనర్ తోసిపుచ్చారు. ఒక్క సంఘటనతోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని బదనాం చేయవద్దని ఒక ప్రకటనలో తెలిపారు..
ప్రజా భద్రత మాటల్లో కాకుండా అమల్లో కనిపించాలన్న డిమాండ్ ఈ ఘటనతో మరింత బలపడుతోంది.
Next Story

