
ఐఆర్ఆర్ కేసులో ఆర్కే న్యాయ పోరాటం
ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్.
రాష్ట్ర రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అలైన్‌మెంట్ అక్రమాల కేసులో సరికొత్త న్యాయపోరాటం మొదలైంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) గురువారం హైకోర్టును ఆశ్రయించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వం మారగానే సీఐడీ అత్యంత వేగంగా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను తక్షణమే నిలిపివేసి, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆయన కోరారు. కేసును మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, తన వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలతో ఆర్కే వేసిన ఈ పిటిషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రత్యేక కోర్టులోనే విచారించాలి.. ఆళ్ల వాదన
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం.. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఉన్నాయని ఆళ్ల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐఆర్‌ఆర్ కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక మంత్రి , మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని గుర్తుచేశారు. నిందితుల హోదాను బట్టి ఈ కేసు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. అందుకే ఏసీబీ కోర్టులో జరుగుతున్న తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని కోరారు.
క్లోజర్ రిపోర్ట్ కాపీలు ఎక్కడ
మరోవైపు, సీఐడీ తీరుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2024లో సీఐడీ దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్‌తో పాటు, ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీలను తనకు అందజేయాలని కోరుతూ రెండో పిటిషన్ వేశారు. కేసును మూసివేస్తున్నట్లు నాకు నోటీసు ఇచ్చారు కానీ, ఆ క్లోజర్ రిపోర్ట్ కాపీలను మాత్రం ఇవ్వడం లేదు. అవి లేకుండా నేను కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ (అభ్యంతర పిటిషన్) ఎలా దాఖలు చేయగలను? అని ఆయన ప్రశ్నించారు. చార్జిషీట్ కాపీని ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రభుత్వం మారగానే మాట మార్చారా?
2022లో తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అన్ని ఆధారాలను సేకరించిందని, 2024లో చార్జిషీట్ కూడా సిద్ధం చేసిందని ఆళ్ల తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ కేసును పూర్తిగా మూసివేసేందుకు (Close) సీఐడీ సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంపై తాను చేసిన పోరాటాన్ని తార్కిక ముగింపు వరకు తీసుకువెళ్తానని, అందుకోసం తనకు అవసరమైన పత్రాలను ఇప్పించాలని హైకోర్టును వేడుకున్నారు.
Next Story

