గుండెకాయ లేకుండా విశాఖ  రైల్వే జోన్
x
కేకే లైన్‌లో గుహ నుంచి వస్తున్న గూడ్సు రైలు

గుండెకాయ లేకుండా విశాఖ రైల్వే జోన్

లేకలేక వచ్చిన సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కిరండోల్‌–కొత్తవలస లైన్‌ లేకపోవడంపై సరికొత్త అలజడి మొదలైంది.


విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఒక కల. దశాబ్దాల తరబడి ఈ జోన్‌ కోసం పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు అనేకం జరిగాయి. ఎట్టకేలకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అనంతరం కేంద్ర కేబినెట్‌ కూడా దీనికి ఆమోదం తెలిపింది. జోన్‌పై ప్రకటన అయితే వెలువడింది గాని అందుకు అవసరమైన ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తూనే వచ్చింది. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి.. అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇలా జోన్‌ ప్రకటన వచ్చిన ఆరేళ్ల తర్వాత గత ఏడాది జనవరి 8న జోన్‌ ప్రధాన కార్యాలయ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. జూన్‌లో రైల్వే బోర్డు కొత్త జోన్‌కు కొత్త జీఎంను నియమించింది. ఆపై కూడా జోన్‌ పురోగతి నత్తనడకనే సాగుతోంది.

కేకే లైన్‌లో ఎల్తైన వంతెనపై నుంచి విశాఖ పోర్టుకు వస్తున్న రైలు

కొత్త జోన్‌లోకి నాలుగు డివిజన్లు..
సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలోకి నాలుగు డివిజన్లను చేర్చారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో వాల్తేరు డివిజన్‌ స్థానంలో కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్‌ను కలిపారు. మరోవైపు అప్పటివరకు ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి కొత్తగా రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో కలిపారు. దీంతో ఆ జోన్‌లో రాయగడ, ఖుర్దారోడ్డు, సంబల్‌పూర్‌ డివిజన్లు ఉన్నట్టయింది. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడంపై ఈ ప్రాంతంలో వ్యతిరేకత కొనసాగుతోంది.

కేకే లైన్‌లో ఐరన్‌ ఓర్‌తో ప్రయాణిస్తున్న గూడ్సు రైలు

ఇప్పుడే ఎందుకు అలజడి?
ఇప్పటివరకు వాల్తేరు డివిజన్‌ పరిధిలో కొనసాగిన కిరండోల్‌–కొత్తవలస (కేకే) లైన్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌లో విలీనం చేస్తూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్టు తాజాగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాయగడ డివిజన్‌ తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉంది. కేకే లైన్‌ విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి కిరండోల్‌ (చత్తీస్‌గఢ్‌) వరకు 445 కిలోమీటర్ల మేర దూరం ఉంది. ఈ కేకే లైన్‌ ద్వారా రైల్వేకి ఏటా సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. విశాఖపట్నం పోర్టుకు, స్టీల్‌ప్లాంట్‌కు చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ (ముడి ఇనుప ఖనిజం) రవాణా అవుతోంది. ఇంతటి ఆదాయ వనరులున్న కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌ (తూర్పు కోస్తా జోన్‌)లో కలపడంపై వైఎస్సార్‌సీపీ, సీపీఐ తదితర పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
సౌత్‌ కోస్ట్‌ జోన్‌లో కేకే లైన్‌ లేకపోతే?
కేకే లైన్‌ను కొత్తగా ఏర్పాటైన సౌత్‌ కోస్ట్‌ జోన్‌లో కాకుండా తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోకి వచ్చే రాయగడ డివిజన్‌లో కలపడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చే నష్టం ఏమిటన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారతీయ రైల్వేలో అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే లైన్లలో ఒక్కటైన కేకే లైన్‌ను ఒడిశా అధీనంలో ఉన్న రాయగడ డివిజన్‌లో కలపడం ఏపీలోని కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా ఇప్పటివరకు డివిజన్‌లో ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కూడా రాయగడ డివిజన్‌ పరిధిలోకి తేవడంపై కూడా వీరు మండిపడుతున్నారు. అంతేకాదు.. ఏపీ మొత్తాన్ని విశాఖ రైల్వే జోన్‌ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ, సీపీఐ నాయకులు రెండు మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలపడం వల్ల సౌత్‌ కోస్ట్‌ జోన్‌కు వచ్చే నష్టమేమీ ఉండదని కూటమి నేతలు అంటున్నారు. ఏ లైన్‌/సెక్షన్‌ నుంచి వచ్చే ఆదాయమైనా రైల్వేకే చెందుతుంది తప్ప ఆ జోన్‌కో, డివిజన్‌కో, ఆ రాష్ట్ర ప్రభుత్వానికో లేదా స్థానిక సంస్థలకో కాదని వీరు చెబుతున్నారు.
జోన్‌కు కనీసం మూడు జోన్లుండాలి..
నిబంధనల ప్రకారం.. జోన్‌కు మూడు డివిజన్లుండాలి. ఈ లెక్కన తూర్పు కోస్తా జోన్‌లో వాల్తేరు డివిజన్‌ రద్దవడంతో ప్రస్తుతం ఉన్న ఖుర్దా, సంబల్‌పూర్‌లతో పాటు మరో కొత్త డివిజన్‌ అవసరమవుతుంది. జోన్‌ కొనసాగాలంటే కొత్తగా రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేసి తూర్పు కోస్తా జోన్‌ పరిధిలోకి తెచ్చారని రైల్వే కార్మిక యూనియన్‌ సీనియర్‌ నేత ఒకరు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధికి చెప్పారు. రాయగడ డివిజన్‌లోకి కేకే లైన్‌ను తేవడం వల్ల సౌత్‌ కోస్ట్‌ జోన్‌కు ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.
ఇదీ కేకే లైన్‌ స్వరూపం
ఐరన్‌ ఓర్‌ రవాణా కోసం జపాన్‌ ఆర్థిక సాయంతో భారతీయ రైల్వే 1960లో కేకే లైన్‌ నిర్మాణాన్ని చేపట్టింది. 1966–67లో ప్రారంభించింది.. కేకే లైన్‌ మొత్తం 445 కి.మీల పొడవుంది. ఇందులో ఏపీలో 138 కి.మీలు, ఒడిశాఖలో 131 కి.మీలు, చత్తీస్‌గఢ్‌లో 194 కి.మీలు ఉంది. ఈ మార్గంలో కొండలను తొలిచి 58 టన్నెల్స్‌ (సొరంగాల)ను నిర్మించారు. 1982 నాటికి పూర్తిగా ఈ కేకే లైన్‌ విద్యుదీకరణ పూర్తయింది. తొలుత ఆగ్నేయ రైల్వే జోన్‌లో ఉన్న కేకే లైన్‌.. 2003 ఏప్రిల్‌ నుంచి తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోని వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఉంది. కేకే లైన్‌ అత్యధిక లాభదాయకమైన ఆదాయ వనరుగా ఉంది. ఈ మార్గం ద్వారా ఏడాదికి రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుండగా రూ.3 వేల కోట్ల లాభం ఆర్జిస్తోంది.

ఈఏఎస్‌ శర్మ

స్థానికులకు అన్యాయం జరుగుతుంది..
సౌత్‌ కోస్ట్‌ జోన్‌ నుంచి కేకే లైన్‌ను తప్పిస్తే భవిష్యత్తులో స్థానికులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. రాయగడ డివిజన్‌లో కేకేలైన్‌ను చేరిస్తే ఒడిశా వాసులకు ఎంప్లాయిమెంట్‌ ఛాన్స్‌ ఎక్కువగా ఉంటుంది. స్థానిక కోటాలో ఈ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు రావాలంటే కేకే లైన్‌ను కొత్త జోన్‌లోనే ఉంచాలి’ అని భారత ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు వివరించారు.

ఎస్‌ఎస్‌ శివశంకర్‌

వాల్తేరు డివిజన్‌ సౌత్‌ కోస్ట్‌లోనే ఉండాలి..
‘మునుపటి వాల్తేరు డివిజన్‌ను సౌత్‌ కోస్ట్‌ జోన్‌లోనే ఉండాలి. అలా ఉంచితేనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుంది. లేనిపక్షంలో ఎస్టీ నిరుద్యోగులు రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ఇక్కడి వారు ఒడిశా వారితో పోటీ పడాలి. అవకాశాలు తగ్గిపోయే ఛాన్స్‌ ఉంది. కొత్త జోన్‌లో వాల్తేరు డివిజన్‌ ఉంటుందని అంటున్నారు. దీనికి సరిహద్దులు తేల్చాలి. ఏపీలోనే విశాఖపట్నం డివిజన్‌ను ఉంచాలి’ అని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ శివశంకర్‌ చెప్పారు.

కేకే రాజు

కేకే లైన్‌ కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమం..
కేకే లైన్ ను సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పరిధిలో కొనసాగించకపోతే వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుంది. తమతో ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే కూటమి నాయకులు కలిసి రావాలి. పలాస–ఇచ్ఛాపురం సెక్షన్‌తో పాటు అత్యధిక రాబడిని తెచ్చే కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలుపుతుంటే రాష్ట్రానికి చెందిన ముగ్గురు కేంద్రమంత్రులూ గాడిదలు కాస్తున్నారా? విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు.
Read More
Next Story