
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో లిఫ్ట్ కూలి వ్యక్తి మృతి
హాస్పిటల్‌లో భద్రాత ప్రమాణాలపై మరో సారి చర్చ.. 2024లో ఇదే ఆసుప్రతిలో డ్యూటీ డాక్టర్‌పై అత్యాచారం, ఆపై హత్య..
కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఒక వ్యక్తి పనిచేయని లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందారు. ఈ ఘటన ఆసుపత్రి భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలను సంధిస్తోంది.
మృతుడిని అరూప్ బెనర్జీ (41)గా గుర్తించారు. తన కొడుకు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బెనర్జీ.. ట్రామా కేర్ సెంటర్‌లోని లిఫ్ట్ ఎక్కాడు. అది ఒక్కసారిగా కుప్పకూలింది. బేస్‌మెంట్‌లో చిక్కుకున్న అతను గంట పాటు బయటకు రాలేక చివరకు శ్వాస వదిలాడు.
రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే ఆసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనతో ఆసుపత్రి భద్రతా లోపాలు బయటపడ్డాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది.
కానీ తాజా ఘటన మళ్లీ భద్రతా లోపాలను బయటపెట్టింది. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు, ఇతర రోగుల బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు.
ఎన్నికల బరిలో బాధితురాలి తల్లి?
పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024 అత్యాచారం తర్వాత హత్యకు గురయిన బాధితురాలి తల్లిని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పానిహాటి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) యోచిస్తోంది.
‘‘ఆసుపత్రిని సందర్శించాక ప్రాథమిక నివేదిక కోరతాం. లిఫ్ట్ సరిగా పనిచేయకపోయినా, భద్రతా సిబ్బంది లేకపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి,” అని టీఎంసీ ఎమ్మెల్యే, కోల్‌కతా ఉపమేయర్ అతిన్ ఘోష్ డిమాండ్ చేశారు.

