పరిశ్రమల అనుమతుల్లో విప్లవం: డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు
x

పరిశ్రమల అనుమతుల్లో విప్లవం: డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు

కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని బృందంతో సీఎం సమీక్షించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని బృందంతో సమీక్ష నిర్వహించిన ఆయన, కేంద్రం ప్రతిపాదించిన డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలను రాష్ట్రంలో వేగంగా అమలు చేయాలని నిశ్చయించారు. దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మే నెలాఖరులోగా ఈ ప్రక్రియను పట్టాలెక్కించి, అవసరమైతే వెంటనే ఆర్డినెన్సులు తీసుకురావాలని సీఎం యంత్రాంగాన్ని ఆదేశించారు.

నిబంధనల భారానికి చెక్.. 800 నుంచి 100 లోపునకు
పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి నిబంధనల జటిలత్వం. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న సుమారు 800 నిబంధనలను 100 లోపునకు కుదించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్మిషన్లు , లైసెన్సుల సంఖ్యను కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చూడాలని, థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామికవేత్తలపై ఎటువంటి అనవసర వేధింపులు లేకుండా చూడాలని ఆయన సూచించారు.
ఆన్‌లైన్ గవర్నెన్స్.. 40 శాతం సమయం ఆదా
పరిశ్రమల దరఖాస్తు నుంచి అనుమతుల వరకు ప్రతి దశనూ 100 శాతం ఆన్‌లైన్ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నూతన విధానం అమలులోకి వస్తే, పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయం 40 శాతం మేర తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ వంటి అంశాల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ కంటే రాష్ట్ర నిబంధనలకే ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
పరిశ్రమలకు నిబంధనలు సడలించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ కేంద్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. కేంద్ర ప్రతిపాదనల కంటే రాష్ట్రం చాలా ముందుందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ కొనియాడారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఏపీ ఇప్పుడు కేవలం Ease of Doing Business కే పరిమితం కాలేదని, అంతకు మించి Speed of Doing Business విధానాన్ని అమలు చేస్తోందని వివరించారు. ప్రజలకు పాలనను వేగంగా అందించడమే (Speed of Delivering Governance) తమ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.
భవిష్యత్ అంతా టెక్నాలజీదే
వచ్చే జూన్ నుండి ప్రారంభం కానున్న డీ-రెగ్యులేషన్ ఫేజ్-3 పై కూడా సీఎం అప్పుడే తన విజన్‌ను పంచుకున్నారు. రానున్న రోజుల్లో అనుమతుల ప్రక్రియలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వాడకాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా లేక్, రియల్ టైం డేటా అనలిటిక్స్, సీఎఫ్ఎంఎస్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అత్యాధునిక వ్యవస్థలను ఈ సంస్కరణలకు అనుసంధానం చేయాలని ఆయన కేంద్ర బృందానికి వివరించారు.
Read More
Next Story