కేంద్రాన్ని నిలదీయండి, పార్లమెంట్‌లో పోరాడండి: తులసి రెడ్డి పిలుపు
x

కేంద్రాన్ని నిలదీయండి, పార్లమెంట్‌లో పోరాడండి: తులసి రెడ్డి పిలుపు

ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గాను, మద్యాంధ్రప్రదేశ్ గాను, జూదాంధ్రప్రదేశ్ గాను మార్చేశారని తులసిరెడ్డి మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్ కు రావలసి హక్కులపైన, విభజన చట్టం అమలుపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, పార్లమెంట్ లో పోరాడి వాటిని సాధించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్య సభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలై 11 ఏళ్లు గడుస్తున్నా, కేంద్రం ఇస్తున్న అరకొర సాయంపై రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సింది కొండంత అయితే.. గత దశాబ్ద కాలంలో విదిల్చింది మాత్రం గోరంతే అంటూ ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. విభజన గాయాలతో విలవిలలాడుతున్న రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మన ఎంపీలు ఢిల్లీలో కేవలం హాజరు వేయించుకోవడం కాదు.. పార్లమెంట్ వేదికగా గళమెత్తి పోరాడాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధమైన హక్కుల సాధనలో రాజీ పడకుండా కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత మన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులపైనే ఉందంటూ ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి సంజీవని

నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించినా, నేటి మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు దాటినా దానిని అమలు చేయకపోవడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని లాంటిది. ఇది అమలై ఉంటే పెట్టుబడులు వచ్చేవి, నిరుద్యోగం అంతమయ్యేది. 2047 వరకు ఆగాల్సిన అవసరం లేకుండానే ఈపాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర'అయ్యేది అని ఆయన స్పష్టం చేశారు. కనీసం ఈ సమావేశాల్లోనైనా ఎంపీలు దీని కోసం పట్టుబట్టాలని కోరారు.

విభజన హామీలు ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది ఐదు కోట్ల ప్రజల ఆశల పత్రం కానీ.. 11 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలన్నీ అటకెక్కిన వైనంపై నర్రెడ్డి తులసి రెడ్డి కేంద్రాన్ని సూటిగా నిలదీశారు. సెక్షన్ 46 (3) ప్రకారం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్న మాట నేటికీ నీటి మూటగానే మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ నిరుద్యోగుల కల.. కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి ఆర్థిక ఊపిరి కావాల్సిన దుగరాజపట్నం పోర్టు కేవలం ఫైళ్లకే పరిమితం కావడం పట్ల ఆయన నిప్పులు చెరిగారు. అటు పట్టిసీమలు, పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు కేంద్రం నిధుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే, విశాఖ-విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు కలగానే మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. నవ్యాంధ్ర భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన 13 కేంద్రీయ విద్యా సంస్థలు కూడా నత్తనడకన సాగడం చూస్తుంటే కేంద్రం ఏపీని చిన్నచూపు చూస్తోందని, ఇకనైనా మన ఎంపీలు పార్లమెంట్‌లో తమ గళాన్ని గర్జనలా మార్చాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

స్వర్ణాంధ్ర కాదు.. ఇది అప్పుల ఆంధ్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలుగంటున్న స్వర్ణాంధ్రపై తులసి రెడ్డి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. బాబు గారూ.. స్వర్ణాంధ్ర దేవుడెరుగు.. రాష్ట్రాన్ని మద్యాంధ్రగా, అప్పుల ఆంధ్రగా మార్చకండి అంటూ ఘాటైన చురకలు అంటించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, పల్లెపల్లెనా బెల్ట్ షాపులు దర్శనమిస్తుంటే.. గంజాయి, డ్రగ్స్ సంస్కృతి యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి ముసుగులో జూదం వెర్రితలలు వేయడంపై మండిపడుతూ.. అభివృద్ధి అంటే జూదమా? అని ప్రశ్నించారు. ఇక అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం సృష్టించిన రికార్డులను ప్రస్తావిస్తూ.. కేవలం 18 నెలల్లోనే ₹2,66,175 కోట్ల అప్పు చేసి రాష్ట్ర భవిష్యత్తును కుదువ పెట్టారని, అప్పులు చేయడంలో ఈ ప్రభుత్వానికి ఏకంగా ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. 2047 నాటి స్వర్ణాంధ్ర మాటలు విడ్డూరంగా ఉన్నాయని, అప్పటిదాకా ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవాలా అంటూ ఆయన నిప్పులు చెరిగారు.

సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు ఎక్కడ?

ఎన్నికల వేళ ప్రజలకు ఆకాశమే హద్దుగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాయని తులసి రెడ్డి నిలదీశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాల అమలుకు ముహూర్తం ఎప్పుడు? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2047 నాటి స్వర్ణాంధ్ర గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు పక్కన పెట్టి, ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో (2029 లోపు) ఏం చేస్తారో ఆచరణలో చూపాలని హితవు పలికారు. హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై ప్రజలు విసిగిపోతున్నారని, ఇకనైనా మాటలు మాని చేతల్లో చూపాలని ఆయన డిమాండ్ చేశారు. వేంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రసాద్ గౌడ్, సుబ్బారెడ్డి, బీగాల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొని రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తారు.

Read More
Next Story