
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి
రాజ్యసభలో 'నార్త్-సౌత్' మంటలు రేపిన రేణుకా చౌదరి!
గుజరాత్ కు ఇచ్చినట్టు దక్షిణాదికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన రేణుకా
"ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026" పై ఏప్రిల్ 2న రాజ్యసభలో రసవత్తర చర్చ సాగింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాజ్ ప్రవేశపెట్టిన బిల్లుపై మొదట కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చర్చను ప్రారంభించారు. ఏపీకి అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించాలంటూనే కేంద్రంపై ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్ల తర్వాత కూడా రాజధాని అంశాన్ని చర్చించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఈ బిల్లు రావడం వెనుక రైతుల త్యాగం, మహిళా రైతుల పోరాటం ఉందన్నారు. వారి త్యాగాలు, పట్టుదలే నేడు పార్లమెంటులో ఈ బిల్లు రావడానికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లయినా, రాజధాని విషయంలో ఇంత అస్పష్టత కొనసాగడం "జాతీయ అవమానం" (National Shame) అని వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల తర్వాత పార్లమెంటు ఈ దిశగా సరైన అడుగు వేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'మూడు రాజధానుల' విధానం వల్ల రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయిందని, దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన భారీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆమె విమర్శించారు. అమరావతినే ఏకైక రాజధానిగా పెట్టమని ఆ అబ్బాయికి సలహా ఇచ్చానని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కేంద్రప్రభుత్వం కేవలం రాజధాని బిల్లు ఆమోదించడమే కాకుండా విభజన చట్టంలోని ఇతర హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు వంటి హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీ నిధుల గురించి కూడా ఆమె ప్రశ్నించారు.
సౌత్-నార్త్ తేడా ఎందుకు?
12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య సుమారు 1.47 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పంపకం పెండింగ్‌లో ఉండటంపై కేంద్రం సమాధానం చెప్పాలని కోరారు. నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం సౌత్- నార్త్ రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోందని వివరించారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తూ దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని, దక్షిణాది రాష్ట్రాల వారిని 'సౌత్ వాలా అని, మదరాసీ వాలా' అని అంటుంటారని చెప్పారు. ఈ వివక్ష ఏమిటని ప్రశ్నిస్తున్న దశలో ఓ కేంద్ర మంత్రి ఆమె మాటలకు అభ్యంతరం చెప్పబోయారు. అందుకు ఆమె ఏమాత్రం అంగీకరించలేదు. ఈ దశలో ప్యానల్ స్పీకర్ కల్పించుకుని సర్దిచెప్పారు. అయితే ఆ మంత్రి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దానికి ఆమె 'చూశారా, అధ్యక్షా, మేము మాట్లాడుతుంటే ఆ మంత్రి సభ నుంచి వెళ్లిపోయారు, ఇది నార్త్- సౌత్ తేడా కాదా?' అని ప్రశ్నిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
విభజన సమయంలో ఏపీలో కలిపిన ఖమ్మం జిల్లాలోని 5 గ్రామాలకు చెందిన ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, వారు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని, కేంద్రం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని అమలు చేయాలన్నారు.
Next Story

