అయ్యా, నాయుడూ! చేసింది చాలిక, దిగిపోతే మంచిదిక!
x
తిరుపతిలో ప్రదర్శన చేస్తున్న భూమన, రోజా

"అయ్యా, నాయుడూ! చేసింది చాలిక, దిగిపోతే మంచిదిక!"

TTD చైర్మన్‌గా బీఆర్ నాయుడిని తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు తమ 'పోరాటాన్ని' తీవ్రతరం చేశారు


తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా బీఆర్ నాయుడి నియామకాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు తమ 'పోరాటాన్ని' తీవ్రతరం చేశారు. శనివారం తిరుపతిలో వైసీపీ నేతలు వినూత్న ఊరేగింపు చేసి టీటీడీ ఛైర్మన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా నిరసన చేపట్టారు. బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు.
తిరుమల ప్రతిష్టకు భంగం: భూమన విమర్శలు
బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తిరుమలలో వరుస వివాదాలు, అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నాయుడి వ్యవహారశైలి పవిత్ర తిరుమల ప్రతిష్టను మసకబార్చేలా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆయనను తొలగించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేస్తామన్నారు.
పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నల వర్షం!
మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "బీఆర్ నాయుడిపై ఇన్ని ఆరోపణలు ఉన్నా ఆయనను కొనసాగించడం చంద్రబాబు చేతగానితనమే. ఒక మహిళను 30 ఏళ్లుగా చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి భయమెందుకు? నాయుడు దగ్గర సీఎం, లోకేష్‌ల వ్యక్తిగత రహస్యాలు ఏవైనా ఉన్నాయా?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "లడ్డూ నెయ్యి విషయంలో ఏమీ లేకపోయినా మెట్లు కడిగి హడావుడి చేసిన పవన్, ఇప్పుడు బీఆర్ నాయుడి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎలాంటి ప్రోక్షణ చేస్తారు?" అని ప్రశ్నించారు.
అలిపిరి వద్ద క్షమాపణ చెప్పాలి..
లడ్డూ కల్తీ అంశంపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడారని, సిట్ (SIT) నివేదికలో కూడా ఏమీ లేదని తేలిపోయిందని రోజా పేర్కొన్నారు. హిందూ సమాజానికి తప్పుడు సమాచారం ఇచ్చి భయాందోళనకు గురిచేసినందుకు చంద్రబాబు అలిపిరి వద్ద సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Read More
Next Story