
రాయలసీమ టూ గ్లోబల్: చంద్రబాబు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయడంతో పాటుగా.. 2029 కల్లా అందరికీ ఇళ్లే లక్ష్యంగా పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు.
రాయలసీమను ప్రపంచ ఉద్యానవన చిత్రపటంలో అగ్రగామిగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ రూపురేఖలను మార్చేలా భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. అటు రైతు సంక్షేమం, ఇటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
రాయలసీమ.. ప్రపంచానికే ఉద్యానవన రాజధాని
ప్రస్తుతం రాయలసీమలో ఉన్న 20 లక్షల హెక్టార్ల ఉద్యానవన సాగును 40 లక్షల హెక్టార్లకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉద్యాన దిగుబడులను 400 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చడమే లక్ష్యమన్నారు. రూ. 30 వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు, మౌలిక వసతుల కోసం రూ. 70 వేల కోట్లు.. మొత్తంగా లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. వ్యవసాయంలో కృత్రిమ మేధ (AI), డ్రోన్లు మరియు యాంత్రీకరణను జోడించి రైతును లాభాల బాట పట్టిస్తామని వివరించారు.
పేదవాడి సొంతింటి కల.. ఉగాదికే గృహప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంత ఇల్లు లేదా ప్లాటు ఇచ్చి తీరుతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గృహప్రవేశాల పండుగ: ఈ ఏడాది ఉగాది నాటికి 3 లక్షల ఇళ్లలో, ఏడాది చివరికల్లా మొత్తం 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అదనపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కక్షగట్టి నిలిపివేసిన ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, హౌసింగ్ అక్రమలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు.
రైతే రాజు.. పేదరికం లేని రాష్ట్రమే ధ్యేయం
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. తమ ప్రభుత్వం పంచసూత్రాల విధానంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రకృతి సేద్యం వైపు 40 లక్షల మంది రైతులను మళ్లించడమే తమ తదుపరి లక్ష్యమని, భూగర్భ జలాల పెంపుదలపై రైతులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Next Story

