రాయలసీమ 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు
x

రాయలసీమ 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు

రాయలసీమకు హక్కులు కాగితాలపైనే… అమలులో మాత్రం సున్నా అని బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు హామీ ఇచ్చిన హక్కులను గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మూడు ప్రభుత్వాలు అమలు చేయకపోవడం కేవలం నిర్లక్ష్యం కాదు.. ఇది స్పష్టమైన ద్రోహం అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం నంద్యాల పట్టణంలోని సమితి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ..

విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీతో పాటు తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులు, కడప ఉక్కు కర్మాగారం, గుంతకల్లు రైల్వే జోన్, అనంతపురంలో ఎయిమ్స్ వంటి హామీలు అన్నీ కేవలం ఎన్నికల నినాదాలుగానే మిగిలిపోయాయని, ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పాలకుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. అలగనూరు రిజర్వాయర్ నుంచి గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం వరకు అన్ని ప్రాజెక్టులు ప్రకటనలకే పరిమితమైపోయాయని, పుష్కర కాలంగా రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడమే ప్రభుత్వాల పని అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమను పూర్తిగా వనరుల దోపిడి కేంద్రంగా మార్చి, నీరు, అటవీ సంపద, ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించేసి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకుని, వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు, కూలీలు, కౌలు రైతులను ఉపాధి లేకుండా చేస్తూ, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు తరలించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
కోస్తా ప్రాంతంలో పండిన వరి పంటను కనీస మద్దతు ధరకు భారీ స్థాయిలో కొనుగోలు చేపడుతున్న ప్రభుత్వాలు, అదే సమయంలో ప్రభుత్వ సూచనల మేరకు వరికి ప్రత్యామ్నాయంగా రాయలసీమలో పండిస్తున్న చిరుధాన్యాలు, పప్పు దినుసులను కనీస మద్దతు ధరకు సేకరించడంలో స్పష్టమైన వివక్ష చూపుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాయలసీమకు హక్కులు కాగితాలపైనే… అమలులో మాత్రం సున్నా అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాల్సి ఉన్నప్పటికీ, ఆగమేఘాల మీద రాజధాని మార్పిడి చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టారని, దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ సమానంగా బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు న్యాయం చేయకుండా రాజధాని అభివృద్ధి పేరుతో నాటకాలు ఆపాలి అని ఆయన హెచ్చరించారు.
సమితి కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ..
అమరావతి రాజధాని పేరుతో కొత్త హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు ముందుగా
రాజధాని ఆదాయంలో రాయలసీమ వాటా ఎంత?
రాజధానిలో రాయలసీమ వాసులకు ఎన్ని ఉద్యోగాలు?
రాజదానిలో రాయలసీమ నిరుద్యోగులకు ఉపాధి, వ్యాపారాల కోసం ఎంత భూమి కేటాయింపు?
అనే అంశాలను స్పష్టంగా ప్రకటించి, పార్లమెంట్ ద్వారా చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలు ఈ ద్రోహంపై మౌనం పాటించడం, రాయలసీమ సమాజం నిశ్శబ్దంగా ఉండడమే దీనికి కారణమని పేర్కొంటూ, ఇకపై ప్రజలను చైతన్యపరిచే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఆందోళనలు, కార్యక్రమాలు చేపట్టి రాయలసీమ హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, బెక్కెం రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, సంజీవ, రామనాగిరెడ్డి, రెడ్డి జాఫర్, చంద్రశేఖర్, యుగంధర్, ఎంసీ కొండారెడ్డి, మనోజ్, దశరథరామ్, శివరాంరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎర్రం శంకర రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story