
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు..మైనింగ్ మిషన్ ప్రారంభం
కంటెయినర్ తయారీ పథకం కోసం ఐదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్లను కేటాయించారు.
దేశీయంగా ఖనిజ వనరుల వెలికితీతను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఆదివారం (ఫిబ్రవరి 1, 2026) లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) కోసం ప్రత్యేక మిషన్ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు
ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యం ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో భారత్ తన పట్టును పెంచుకునేందుకు ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలను ఎంచుకుంది.
ఎంపికైన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు.
లక్ష్యం: ఈ నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేసి మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ప్రోత్సహించడం.
ప్రయోజనం: ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), స్మార్ట్ఫోన్లు, రక్షణ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ఈ చర్య వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
ప్రత్యేక మైనింగ్ మిషన్
ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక మైనింగ్ మిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం వెలికితీతకే పరిమితం కాకుండా, వ్యర్థాల నుంచి ఖనిజాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియకు కూడా మద్దతు ఇస్తుంది.
ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్
భారతీయ ఎగుమతులను వేగవంతం చేసేందుకు, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ ను నెలకొల్పుతామని మంత్రి ప్రకటించారు. కంటెయినర్ తయారీ పథకం కోసం ఐదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్లను కేటాయించారు.
ముఖ్య ఉద్దేశం: ప్రస్తుతం భారత్ కంటెయినర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ కొత్త కార్పొరేషన్ ఏర్పాటుతో భారత్ గ్లోబల్ సప్లై చైన్లో కీలక భాగస్వామిగా మారుతుంది.

