లంకవాసులకు రాణిల్ విక్రమసింఘే భావోద్వేగ లేఖ..
x

లంకవాసులకు రాణిల్ విక్రమసింఘే భావోద్వేగ లేఖ..

‘‘నేను అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నా మాతృభూమికి సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ’’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే


శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్‌ నేత, జనతా విముక్తి పెరమన(జేవీపీ)నాయకుడు అనూర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న తొలి మార్క్సిస్ట్‌ నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆదివారం వెల్లడించిన ఎన్నికల ఫలితాలలో తన సమీప ప్రత్యర్థి సమగి జన బలవేగయ(ఎస్జేబీ) నాయకుడు సజిత్‌ ప్రేమదాసపై ఘన విజయం సాధించారు.

‘బిడ్డను ఒడ్డుకు చేర్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నా..’

ఇక గత అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే వీడ్కోలు పలుకుతూ దేశప్రజలనుద్దేశించి భావోద్వేగ లేఖ రాశారు. ‘‘ఈ బిడ్డ(శ్రీలంక)తో ప్రమాదకర వంతెనపై రెండేళ్ల పాటు ప్రయాణించాను. ఇక బిడ్డను దిసానాయకేకి అప్పగించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీరు (దిసనాయకే) వంతెన నుంచి బిడ్డను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నా. నా పదవీ కాలంలో USD 20 మిలియన్ల వద్ద ఉన్న ఫారిన్ రిజర్వ్‌ను USD 5.7 బిలియన్లకు పెంచగలిగాను. నేను అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నా మాతృభూమికి సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కొత్త అధ్యక్షుడు కూడా సరైన మార్గాన్ని అనుసరిస్తారని, ప్రజలు ఎదుర్కొంటున్న మిగిలిన సమస్యలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నా’’అని లేఖలో పేర్కొన్నారు.

గతంలో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీంతో నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయడంతో 75 ఏళ్ల రాణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. ఆయన దేశాధ్యక్షుడిగా 26 నెలల పాటు కొనసాగారు.

Read More
Next Story