
రాజమండ్రిలో పాల కల్తీ, పార్లమెంటులో కలకలం
17 మంది చనిపోయినా స్పందించరా? అంటూ వైవీ సుబ్బారెడ్డి, రాఘవ్ చద్దా ధ్వజం
రాజమండ్రి కల్తీ పాలన ఘటన రాజ్యసభలో కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించినపుడు సభ యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కల్తీ పాలతో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల కల్తీని అరికట్టేందుకు ఎఫ్‌ఎస్‌ఏఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. కల్తీ పాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. లాలాపేటలో కల్తీ పాల వల్ల 17 మంది చనిపోయారని తెలిపారు. నిరంతరం తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ల్యాబ్‌లకు పంపించాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
శ్వేత విప్లవం మన దేశాన్ని అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఏదైనా వస్తువు కొరత ఉన్నప్పుడే కల్తీ జరుగుతుందని, అది సమృద్ధిగా ఉన్నప్పుడు కాదని మనందరికీ తెలుసు. కానీ, దిగ్భ్రాంతికరంగా, భారీ ఉత్పత్తి ఉన్నప్పటికీ, మన దేశంలో పాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది.
ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యం, ఎందుకంటే శారీరక పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడే 10 రకాల పోషకాలు వాటిలో ఉన్నాయి. అంతేకాకుండా, మన శరీరం ఉత్పత్తి చేయలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా వాటిలో ఉంటాయి. ప్రతి ఏడాది పలు కల్తీ కేసులు నమోదవుతున్నాయన్నారు.
రాఘవ్ చద్దా ఏమన్నారంటే...
అంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆహార కల్తీపై పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం రోజూ తినే ఆహారం అమృతమా? లేక విషమా? అనే సందేహాన్ని కలిగించేలా ఎంపీ రాఘవ్ రాజ్యసభలో గళమెత్తారు. దేశంలో పెరిగిపోతున్న ఆహార కల్తీని ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పుగా ఆయన అభివర్ణించారు. లాభాల కోసం వ్యాపారులు సామాన్యుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో ఆయన ఉదాహరణలతో వివరించారు.
కల్తీ కోరల్లో నిత్యావసరాలు..
రాఘవ్ చద్దా తన ప్రసంగంలో పేర్కొన్న కొన్ని భయంకరమైన కల్తీ వివరాలు ఇవే:
పాలు: పాలలో ప్రమాదకరమైన యూరియా కలుపుతున్నారు.
కూరగాయలు: కూరగాయలు త్వరగా పెరగడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.
పన్నీర్: పన్నీర్‌లో కాస్టిక్ సోడా వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు.
మసాలా దినుసులు: కారప్పొడి వంటి మసాలా దినుసుల్లో ఇటుక పొడిని కలుపుతున్నారు.
ఐస్‌క్రీమ్: ఐస్‌క్రీమ్‌లలో డిటర్జెంట్ (సర్ఫ్) వంటి పదార్థాలు బయటపడటం అత్యంత ఆందోళనకరం.
ఇది వినియోగదారులను మోసం చేయడం మాత్రమే కాదు..
"ఇది కేవలం ఆర్థికంగా వినియోగదారులను మోసం చేయడం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని నెమ్మదిగా క్షీణింపజేయడం (Slow poisoning). కోట్లాది మంది భారతీయుల ప్రాణాలను ఈ కల్తీ ప్రమాదంలో పడేస్తోంది" అని చడ్డా హెచ్చరించారు. దీనికి సంబంధించిన తన ప్రసంగ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
Next Story

