NO CONFIDENCE | రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాసం కుదరదన్న వైస్ ఛైర్మన్
10రోజుల కిందట రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ పై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును సభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించారు.
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన నోటీసును సభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలు అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. పార్లమెంట్ చరిత్రలోనే ఉపరాష్ట్రపతి అయిన రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేపెట్టడం ఇదే తొలిసారి.
రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ పై డిసెంబర్ 10న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రాజ్యసభలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్కడ్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు విమర్శించారు. ఈ నేపథ్యంలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానంపై ఇండియా కూటమి పార్టీలైన తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన 50 మందికిపైగా ఎంపీలు సంతకాలు చేశారు. ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు చైర్మన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని, కాని కాంగ్రెస్ అధ్యక్షుడు, సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోన్‌ను చైర్మన్ తరచు కట్ చేస్తున్నారని విపక్ష ఎంపీలు వాదించారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం సభ నడవాలని, కాని తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్‌లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మన్ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ఒకరు ఆరోపించారు.
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్(Jagdeep Dhankhar)పై తప్పని పరిస్థితుల్లో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ఆవేళ చెప్పారు. ఛైర్మన్ ప్రవర్తన దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, రాజ్యసభ ఛైర్మన్‌పై తమది "వ్యక్తిగత పోరాటం" కాదన్నది మల్లికార్జున ఖర్గే వాదన. "తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చర్య తీసుకోవలసి వచ్చింది. మేం ఇప్పటికే నోటీసు ఇచ్చాము. ఈ సున్నితమైన సమస్యపై ప్రతిపక్షం ఐక్యంగా ఉంది. సభలో మాట్లాడేందుకు చైర్మన్ తమకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. మూడేళ్లుగా క్లిష్టమైన సమస్యలను లేవనెత్తడానికి మాకు సమయాన్ని ఇవ్వలేదు. మేం ఛైర్మన్ నుంచి రక్షణ ఆశిస్తున్నాము.. కానీ, అతను అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే మాట్లాడేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. ఛైర్మన్ స్వయంగా ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే ప్రతిపక్షాల మాట ఎవరు వింటారు?" అని ప్రశ్నించారు.
రాజ్యసభ ఛైర్మన్ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిలా వ్యవహరిస్తున్నారే తప్ప ఉపరాష్ట్రపతిలాగా, సభాధ్యక్షుడు మాదిరిగా లేదని విపక్షాలు విమర్శించారు.
అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించే అధికారం డిప్యూటీ ఛైర్మన్ కు ఉంది. ఆ ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించుకుని అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు.
ధన్కడ్ ను తొలగించాలని కోరుతూ 60 మంది విపక్ష సభ్యులు సంతకాలు చేసి ఈ నెల 10వ తేదీన అభిశంసన తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై నమ్మకం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద వారు ఈ నోటీసు ఇచ్చారు. తనపై ఇచ్చిన నోటీసుపై తాను నిర్ణయం తీసుకోలేనంటూ గురువారం ధన్కడ్ సభకు అధ్యక్షత వహించలేదు. డిప్యూటీ ఛైర్మన్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో హరివంశ్ సభాధ్యక్ష స్థానంలో కూర్చుని ప్రతిపక్షాల నోటీసును తిరస్కరిస్తూ రూలింగ్ ఇచ్చారు. ఉప రాష్ట్రపతిని తొలగించేందుకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు 24వ తేదీ తర్వాతే చెల్లుతుందని పేర్కొన్నారు.
Next Story