ఎనిమిది మంది పరిస్థితి విషమం.. చెన్నై, ముంబై నుంచి ప్రత్యేక మందులు
x
రాజమహేంద్రవరంలోని బాధిత ప్రాంతంలో కొనసాగుతున్న మెడికల్ క్యాంపు

ఎనిమిది మంది పరిస్థితి విషమం.. చెన్నై, ముంబై నుంచి ప్రత్యేక మందులు

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన: నమూనాల ఫలితాలతోనే మూలాలపై స్పష్టత.. మరో 3-5 రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు


రాజమహేంద్రవరం బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ రవిరాజ్ సూచనల మేరకు కిడ్నీల పనితీరు త్వరగా మెరుగుపరచడానికి చెన్నై, ముంబై నుంచి ప్రత్యేక మందులు తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 16న ఇళ్లకు పాల సరఫరా జరిగింది కాబట్టి కొందరిలో ఆలస్యంగా లక్షణాలు కనిపించవచ్చని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బాధితుల నివాస ప్రాంతాల్లో 24 గంటలపాటు వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ చర్యలు మరో నెల పాటు కొనసాగుతాయి.

రాజమహేంద్రవరంలో ఇథలిన్ గ్లైకాల్ కలిసిన పాల సేవన వల్ల నలుగురు మరణించగా, 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ముగ్గురు వెంటిలేటర్‌పై, ఇద్దరు డయాలసిస్‌పై, మరో ముగ్గురు వెంటిలేటర్-డయాలసిస్‌పై ఉన్నారు. బాధితుల్లో ఐదు నెలల పాపతోపాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.


మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో వీరపాండియన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్) డైరెక్టర్ నీలకంఠారెడ్డి కలిసి మాట్లాడారు.

రక్త పరీక్షల్లో ముగ్గురు గుర్తింపు

110 కుటుంబాలకు చెందిన 315 మంది రక్త నమూనాలు సేకరించామని, వీరిలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉన్న ఇద్దరు, అనుమానిత లక్షణాలు ఉన్న మరొకరు అని ముగ్గురిని ఆసుపత్రుల్లో చేర్పించామని అధికారులు వివరించారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మంగళవారం కొత్త కేసులు నమోదు కాలేదు.


పోలీసు విచారణ కొనసాగుతోంది

అదుపులో ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డెయిరీ పాల నిల్వలు, కూలెంట్ వినియోగం, ఇతర అంశాలపై పోలీసులు తీవ్రస్థాయి విచారణ చేస్తున్నారు. పాల శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేసిన మెకానిక్‌ను కూడా విచారించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్

బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలు, తయారీదారులు, నిల్వదారులు, హోల్‌సేల్ వర్తకుల వద్ద నమూనాలు సేకరించి లైసెన్సులు, ఆధారాలు పరిశీలించే ప్రత్యేక డ్రైవ్ చేపడతామని నీలకంఠారెడ్డి ప్రకటించారు. బాధిత ప్రాంతాల్లో స్థానికుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.

‘పాలలో యూరియా కలిసిన ఆనవాళ్లు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. యూరియా కలిసినట్లయితే దీర్ఘకాలం సేవించినప్పుడే కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి. ఇథలిన్ గ్లైకాల్ కలిసిన పాలు సేవించిన 3-4 రోజుల్లోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’ అని వీరపాండియన్ స్పష్టం చేశారు.

పాల శీతలీకరణ మిషన్‌లో కూలెంట్‌గా వాడిన ఇథలిన్ గ్లైకాల్ లీక్ అయినట్లు పోలీసు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. బాధితుల ఇళ్లల్లో మిగిలిన పెరుగు, నెయ్యి, వెనిగార్, పాల నమూనాలు సేకరించి హైదరాబాద్, కాకినాడలోని జాతీయ ఆహార భద్రతా ప్రయోగశాలలకు పంపించామని నీలకంఠారెడ్డి వివరించారు. విక్రేత విక్రయించిన పాలు దొరకలేదు కానీ పెరుగు, పన్నీర్, నెయ్యి, మీగడ నమూనాలు సేకరించాం. నమూనా ఫలితాలు బుధవారం నుంచి శనివారం మధ్య దశలవారీగా వస్తాయని, వాటి ఆధారంగానే కల్తీ మూలాలపై స్పష్టత వస్తుందని అన్నారు.

ఈ ఘటనలో మొత్తం నలుగురు అధికారికంగా మృతి చెందగా, ఒకరు ఇంతకు ముందే మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా పాల భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరపాండియన్ స్పష్టం చేశారు.

Read More
Next Story