
ఈ 3 జిల్లాలకు రేపు, ఎల్లుండి వర్షం ముప్పు
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంతో శని, ఆదివారాల్లో నాలుగైదు జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంక్రాంతికి ముందు దక్షిణ భారత రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో, భూమధ్యరేఖకు సమీపంలో తీవ్ర అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. పొట్టువిల్ (శ్రీలంక) నుంచి 570 కి.మీ., బట్టికోలా (శ్రీలంక) నుంచి 620 కి.మీ., కరైకల్ (తమిళనాడు) నుంచి 990 కి.మీ., చెన్నై నుంచి 1,140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. భారత వాతావరణ విభాగం ప్రకారం ఇది తీవ్ర వాయుగుండంగా బలపడింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది
ఈ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ
దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం, ఆదివారం శ్రీలంక,తమిళనాడు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వాయుగుండం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.
రుతుపవనాల సీజన్ ముగిసినా…
సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్ డిసెంబర్ 31 నాటికి ముగుస్తుంది.
వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం, బంగాళాఖాతంలోని తుపానులు, వాయుగుండాలు, సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో చాలా తక్కువగా మాత్రమే ఏర్పడతాయి.ఇతర వివరాల్లో, 1891-2024 మధ్య రెండు తీవ్ర తుపాన్లు, ఆరు సాధారణ తుపాన్లు, 12 వాయుగుండాలు ఏర్పడ్డాయి.వీటిలో ఎక్కువ శాతం శ్రీలంక తీరం దాటింది. మూడు వాయుగుండాలు మినహా మిగిలినవన్నీ సంక్రాంతికి ముందే ఏర్పడినవి.
వీటిలో ఏకైక తుపాను మాత్రమే ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది.

