‘గ్యాస్ కష్టాలపై మోదీ స్పందించాలి’
x

‘గ్యాస్ కష్టాలపై మోదీ స్పందించాలి’

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని, దీనిపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌లో నిరసనలు..

ఎల్పీజీ కొరతపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల నిరసనలు వెల్లువెత్తాయి. యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరా దెబ్బతిన్నదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ చెబుతున్నా.. ఆయన ఇతర కారణాల వల్ల ఆందోళన చెందుతున్నారని రాహుల్ విమర్శించారు.

మోదీకి మిగతా విషయాల్లో ఆందోళన..

సభలో ప్రధాని కనిపించకపోవడంపై కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. “ప్రజలకు భయం అక్కర్లేదు అని మోదీ చెబుతున్నారు. కానీ ఆయన స్వయంగా కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతున్నారు. అందుకే సభలోకి రావడం లేదు,” అని అన్నారు. “నిన్న పార్లమెంట్‌లో ప్రధానమంత్రిగారి కుర్చీ ఖాళీగా ఉంది. దేశాన్ని ధైర్యం చెప్పే వ్యక్తి తానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది,” అని రాహుల్ వ్యాఖ్యానించారు.

“ఇది కేవలం ఎల్పీజీ సమస్య మాత్రమే కాదు. మొత్తం ఇంధన రంగం సమస్యగా మారే ప్రమాదం ఉంది. మనం ఇప్పటినుంచే సిద్ధం కావాలి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది,” అని రాహుల్ హెచ్చరించారు.

మహిళా ఎంపీల నిరసనలు..

కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ తదితర పార్టీల మహిళా ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ సమీపంలో నిరసన చేపట్టారు. “నామ్ నరేందర్, కామ్ సరెండర్”, “మోదీ జీ, ఎల్పీజీ” వంటి నినాదాలు చేశారు. ఈ నిరసనలో ప్రియాంకతో పాటు సహా పలువురు మహిళా ఎంపీలు ఇటుకలతో చేసిన స్టవ్ ముందు కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఖర్గే విమర్శలు..

ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత కారణంగా ప్రజలు క్యూల్లో నిలబడుతున్నారని, చిన్న, పెద్ద పరిశ్రమలు కూడా ప్రభావితమవుతున్నాయని ఖర్గే అన్నారు. ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

గ్యాస్ సంక్షోభంపై చర్చకు డిమాండ్..

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం, గ్యాస్ కొరతను పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ కొద్దిసేపటికే వాయిదా పడింది. తర్వాత రాహుల్ గాంధీ సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ మకర్ ద్వార్ మెట్లపై కూర్చొని వారితో చాయ్ తాగారు.

ఢిల్లీలో రెస్టారెంట్ యజమానుల కష్టాలు..

దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సరఫరా అస్థిరంగా ఉండటంతో అనేక రెస్టారెంట్లు నడవడం లేదు. చాలా చోట్ల ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా గ్యాస్ మాత్రమే మిగిలి ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సి రావచ్చని, ఉద్యోగుల జీతాల విషయంలో కూడా ఆందోళన ఉందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా సజావుగానే ఉందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

Read More
Next Story