
భారత్–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై రాహుల్ విమర్శలు
భారత రైతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత
భారత్–అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం గురించి కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒప్పందాన్ని నిర్బంధ లొంగుబాటుగా అభివర్ణించారు. దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఇంధన భద్రత విషయంలో, రైతుల ప్రయోజనాల పరిరక్షణలోనూ కేంద్రం రాజీ పడిందని విమర్శించారు.
‘దేశాన్నే అమ్మేశారు..’
కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. ఈ ఒప్పందం వల్ల భారత్ తన స్వాభిమానాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఈ ఒప్పందం దేశాన్ని అమ్మివేసినట్టే ఉందని కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీపై కూడా వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. అమెరికా ఒత్తిడికి లోనై దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని విమర్శించారు.
‘ఆ విషయాలు అప్రస్తుతం’
అమెరికాలోని ఎప్స్టీన్ కేసును ప్రస్తావిస్తూ.. ఆ ఫైళ్ల వల్లే ప్రధాని భయపడుతున్నారని రాహుల్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సభాధ్యక్షుడు జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలను సభలో ప్రస్తావించరాదన్నారు. అలాగే కేంద్ర మంత్రి హర్దీప్ పూరిపై చేసిన ఆరోపణలను కూడా రికార్డు నుంచి తొలగించాలని ఆదేశించారు.
‘దేశీయ పరిశ్రమలకు భారీ నష్టం’
వాణిజ్య ఒప్పందంలో సుంకాల అంశంపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ వస్తువులపై అమెరికా విధించే సుంకాలు 3 శాతం నుంచి 18 శాతానికి పెరిగాయని, అదే సమయంలో అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించిందని అన్నారు. ఈ పరిస్థితి దేశీయ పరిశ్రమలకు నష్టదాయకమని రాహుల్ అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకంగా టెక్స్‌టైల్ రంగంపై ప్రభావం గురించి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌కు అమెరికా సుంకాలు తగ్గించిన నేపథ్యంలో భారత వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. రైతుల పరిస్థితి కూడా ఇలాగే క్షీణిస్తుందని, విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు తెరవడం ద్వారా భారత రైతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు.
అమెరికాతో చర్చలు జరిగే సమయంలో భారత్ సమాన భాగస్వామిగా నిలవాల్సిందని, దేశ డేటా, ఇంధన భద్రత వంటి అంశాలను రక్షించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ సూచించారు. మొత్తం మీద ఈ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు, సాధారణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమన్న అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేశారు.

