అరుణాచల్ మహిళలపై జాతి వ్యతిరేక దూషణలు
x

అరుణాచల్ మహిళలపై జాతి వ్యతిరేక దూషణలు

ఢిల్లీ మాల్వియా నగర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు


అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మహిళలపై జాతి వ్యతిరేక దూషణలు చేయడం కలకలం రేగింది. ఈ అంశంపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఏసీ ఫిట్టింగ్ సమయంలో జరిగిన వివాదం చిలికి చిలికి గాలి వాన‌గా మారి జాతి దూష‌ణ‌లకు దారి తీసింది.

తమపై పక్కింటివారు జాతి దూషణలు చేసి, వ్యక్తిత్వ హననం చేశారని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన మ‌హిళ‌లు ఆరోపించారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో చోటు చేసుకుంది. అక్క‌డి అద్దె ఇంటిలో ఇది జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఫిబ్రవరి 20న మధ్యాహ్నం నాలుగో అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్‌లో ఏసీ అమర్చించేందుకు ఎలక్ట్రిషియన్‌ను పిలిచారు. డ్రిల్లింగ్ పనుల సమయంలో దుమ్ము, చెత్త కింద అంతస్తుకు పడటంతో ఇరుగు పొరుగువారు అభ్యంత‌రం తెలిపారు.
చెత్త పడటంపై ప్రారంభమైన ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఆ మహిళలపై ఈశాన్య ప్రాంతానికి చెందినవారంటూ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.
వీడియోలో మ‌హిళా నిందితురాలు ఈశాన్య మహిళలను అవమానకరంగా వ్యాఖ్య‌లు చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌హిళ‌లు మ‌సాజ్ సెంట‌ర్ లో ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించినట్లు స‌మాచారం.
మ‌రో నిందితుడు కూడా ఈ వివాదంలో త‌ల‌దూర్చి దూషణలు చేసినట్లు తెలుస్తోంది. ఒక పోలీసు అధికారి అక్కడే ఉండి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 79 (మహిళల మర్యాదను అవమానించే ఉద్దేశంతో మాటలు), 351(2) (క్రిమినల్ బెదిరింపు), 3(5) ( ఉద్దేశ్య‌పూర్వ‌కంగా సామూహిక దాడి), 196 (మతం, జాతి, జన్మస్థలం తదితరాల ఆధారంగా విద్వేషాన్ని రెచ్చ‌గొట్ట‌డం) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు అని అధికారులు తెలిపారు.
మహిళలు తమపై తప్పుడు ఆరోపణలు చేసి, మానసిక వేధింపులకు గురిచేశారని నిందితులు చెబుతున్నారు. . నిందితులు అధికారికంగా క్షమాపణ చెప్పాలని బాధితులు డిమాండ్ చేశారు.
భవనం మరమ్మత్తుల కారణంగా రెండు నెలల్లో ఫ్లాట్ ఖాళీ చేయాలని బ్రోకర్ చెప్పడంతో పరిస్థితి మరింత విక‌టించింద‌ని వారు తెలిపారు.బాధిత‌మహిళల తరఫు న్యాయవాది ఈ ఘటన ఈశాన్య ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న జాతి వివక్షకు తార్కాణం అని పేర్కొన్నారు.
మరోవైపు నిందితుల త‌ర‌పు న్యాయవాది ఈ ఘటనను సోషల్ మీడియాలో ఎక్కువ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read More
Next Story