
కెనడాలో పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ హత్య..
లాసాల్‌లో కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కెనడాలో పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, గాయని నాన్సీ గ్రేవాల్ హత్యకు గురయ్యారు. ఒంటారియో రాష్ట్రంలోని లాసాల్ పట్టణంలో గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్తాన్ వాదులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమెకు గతంలోనే పలుమార్లు బెదిరింపులు వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పంజాబ్ మూలాలున్న 45 ఏళ్ల నాన్సీ గ్రేవాల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండేది. పంజాబ్‌కు సంబంధించిన సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేది. ఖలిస్తాన్ వాదులపై ఆమె తరచూ విమర్శలు చేయడంతో వార్తల్లో నిలిచింది.
పోలీసుల సమాచారం ప్రకారం మార్చి 3 రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో లాసాల్ పట్టణంలోని టాడ్ లేన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాన్సీపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. అనంతరం మృతురాలిని నాన్సీ గ్రేవాల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జలంధర్‌లో మీడియాతో మాట్లాడిన నాన్సీ తల్లి శిందర్‌పాల్ కౌర్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను పలుమార్లు కత్తితో పొడిచారని ఆమె తెలిపారు. విండ్సర్ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తన కుమార్తెపై ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కెనడియన్ అధికారులను ఆమె కోరారు.
గతంలో కూడా నాన్సీ ఇంటిపై దాడి జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒకసారి ఆమె ఇంటిని నిప్పు పెట్టి దహనం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆ ఘటన తర్వాత నుంచి ఆమెకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు.
ముఖం కప్పుకున్న ఒక యువకుడు నాన్సీ ఇంటి వద్దకు వచ్చి బెదిరించిన ఘటన కూడా జరిగినట్లు ఆమె తల్లి చెప్పారు. భద్రత కోసం నాన్సీ తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఒకసారి ఆ వ్యక్తి కెమెరాల్లో కనిపించడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.
నాన్సీ గ్రేవాల్ 2018లో కెనడాకు వెళ్లారు. అక్కడ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి రెండు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. మార్చి 2న చివరిసారిగా తన కుమార్తెతో మాట్లాడినట్లు ఆమె తల్లి తెలిపారు.
ఈ ఘటనపై కెనడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

