Punjab | రోడ్లను దిగ్బంధించిన రైతులు; 35వ రోజుకు దల్లేవాల్ సమ్మె..
x

Punjab | రోడ్లను దిగ్బంధించిన రైతులు; 35వ రోజుకు దల్లేవాల్ సమ్మె..

తమ డిమాండ్ల పరిష్కారం కోసం పంజాబ్‌లో రైతులు చేపట్టిన బంద్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు.


తమ డిమాండ్ల పరిష్కారం కోసం పంజాబ్‌ రైతులు చేపట్టిన బంద్‌ కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లను దిగ్బంధించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రైళ్లను అడ్డుకున్నారు. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పాటియాలా-చండీగఢ్ జాతీయ రహదారిపై ధరేరి జట్టన్ టోల్ ప్లాజా వద్ద, అలాగే అమృత్‌సర్ గోల్డెన్ గేట్ వద్ద, నగర ప్రవేశ ద్వారం దగ్గర రైతులు ఆందోళన చేపడుతున్నారు.

సాయంత్రం 4 వరకు బంద్..

గత వారం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా డిసెంబర్ 30వ తేదీ పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పాటించనున్నారు. బంద్‌లో భాగంగా పాటియాలా-చండీగఢ్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ధరేరి జట్టన్ టోల్ ప్లాజా వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఫగ్వారాలో జాతీయ రహదారి - 44 మీద షుగర్‌మిల్ క్రాసింగ్ దగ్గర ధర్నాకు దిగడంతో నకోదర్, హోషియార్‌పూర్, నవాన్‌షహర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఫగ్వారా-బంగా రహదారిలోని బెహ్రామ్ టోల్ ప్లాజా వద్ద కూడా ధర్నా చేపట్టారు.

అత్యవసర సేవలకు మినహాయింపు..

పంజాజ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నా..అత్యవసర సేవలను మాత్రం అనుమతిస్తామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లేవారిని, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లే వారిని, ఆంబులెన్స్‌లను అడ్డుకోమని స్పష్టం చేశారు.

పరీక్షల రీషెడ్యూల్..

చాలా పాఠశాలలు ఇప్పటికే శీతాకాల సెలవుల ప్రకటించాయి. పంజాబ్ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు షెడ్యూల్ చేసిన పరీక్షలను మంగళవారానికి వాయిదా వేసాయి. అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ (జీఎన్‌డీయూ) డిసెంబర్ 30న జరగాల్సిన యూజీ పరీక్షలను జనవరి 12కి వాయిదా వేసింది. ట్రక్కు యజమానులు బంద్‌కు మద్దతివ్వడంతో పండ్లు, కూరగాయల మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులకు సంఘీభావంగా పాల వ్యాపారులూ రోడ్డెక్కారు. రైతు సంఘాల నేతలు హైవేలు, లింక్ రోడ్లపై బైఠాయించడంతో ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు రోడ్లపై నిలిచిపోయాయి. మొహాలి జిల్లాలో మార్కెట్‌లు నిర్మానుష్యంగా మారాయి. ట్రాఫిక్ అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

పొరుగు ప్రాంతాలపై ప్రభావం..

అంబాలాతో సహా రాష్ట్రంలోని కొన్ని పొరుగు ప్రాంతాలలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. అంబాలా నుంచి చండీగఢ్, మొహాలి, పాటియాలా, పంజాబ్‌లోని ఇతర సమీప నగరాలకు ప్రయాణించే వందలాది మంది రోజువారీ ప్రయాణికులు బంద్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. చండీగఢ్‌లోని వివిధ కోచింగ్ సెంటర్‌లలో చదువుతున్న ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందిపడ్డారు.

35వ రోజుకు దల్లేవాల్ సమ్మె..

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్-హర్యానా సరిహద్దులో జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ చేపట్టిన అమరణ దీక్ష సోమవారానికి 35వ రోజుకు చేరుకుంది. 70 ఏళ్ల రైతు నాయకుడు ఇప్పటివరకు వైద్య చికిత్సకు అంగీకరించడం లేదు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని దల్లేవాల్ గతంలో ప్రకటించారు. దల్లేవాల్‌ను ఆసుపత్రికి మార్చడానికి ఒప్పించేందుకు సుప్రీం కోర్టు డిసెంబర్ 31 వరకు పంజాబ్ ప్రభుత్వానికి సమయం ఇచ్చింది.

రైతుల డిమాండ్లు..

SKM (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో రైతులు ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద ధర్నా చేస్తున్నారు. 101 మంది రైతులతో కూడిన “ జాతా ” (సమూహం) డిసెంబర్ 6 నుంచి14వ తేదీ మధ్య మూడుసార్లు కాలినడకన ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే హర్యానాకు చెందిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. MSPతో పాటు, రైతులకు రుణమాఫీ, పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపు, పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story