‘గీతం’ భూగోతంపై ప్రజా ఉద్యమం.!
x
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌

‘గీతం’ భూగోతంపై ప్రజా ఉద్యమం.!

విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించే ప్రయత్నాలపై ఉద్యమిస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రకటించారు.

విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం.శ్రీభరత్‌ చైర్మన్‌గా ఉన్న గీతం విశ్వవిద్యాలయం కబ్జాలో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన భూమిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ యూనివర్సిటీ యాజమాన్యం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని, దీనిని రెగ్యులరైజ్‌ చేసేందుకు వీలుగా ఈనెల 30న జీవీఎంసీ కౌన్సిల్‌లో తీర్మానాన్ని ప్రవేశపెడుతోందన్నారు. ప్రభుత్వం ఈ ఆలోచనను ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విశాఖలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌లు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎవరేమన్నారంటే?

రూ.5 వేల కోట్ల భూమిని అప్పనంగా ఇచ్చేస్తారా?
‘ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు విశాఖలో భూములను ఎలా దోచుకోవాలా అని చూస్తున్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గీతంకి రూ.5 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చేశారు. ఇప్పుడు గీతం సంస్థ కబ్జాలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేయడానికి ఈనెల 30న జీవీఎంసీ కౌన్సిల్‌లో తీర్మానం చేస్తున్నారు. ఇలా క్రమబద్ధీకరించే అధికారం మీకెక్కడిది? పేదలు సెంటు భూమి ఆక్రమించుకుంటే తొలగిస్తారే? మరి గీతంకి ఏ రకంగా 54 ఎకరాలను ధారాదత్తం చేస్తారు? దీనిపై ప్రజా ఉద్యమం చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. తొలుత బుధవారం ఉదయం 11 గంటలకు మా కార్పొరేటర్లతో జీవీఎంసీ కమిషనర్‌ని కలిసి తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని అడుగుతాం. గురువారం గీతం కబ్జాలో ఉన్న 54.79 భూములను పరిశీలిస్తాం. 30న కౌన్సిల్‌కు వెళ్లి ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తాం. గాంధీ విగ్రహం వద్ద కౌన్సిల్‌ సమావేశం పూర్తయ్యే వరకు నిరసన వ్యక్తం చేస్తాం. మలివిడతలో మా ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. మాతో కలిసొచ్చే వారితో ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
గీతం భూ దోపిడీని బీజేపీ, జనసేనలు సమర్థిస్తాయా?
‘బీజేపీ పెద్దలను, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పెద్దలను అడుగుతున్నాం.. గీతం భూ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా? మీరు ఇందులో భాగస్వాములా? ఇంత దోపిడీ చేస్తుంటే మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? సమాధానం చెప్పి తీరాలి. ప్రజలకు వివరణ ఇవ్వాలి. 54.79 ఎకరాలను కబ్జా చేసినట్టు సాక్షాత్తూ ఎంపీ భరతే చెప్పారు. గతంలో మీకు సరిపడినంతగా భూమి ప్రభుత్వం ఇచ్చింది కదా? ఇంకా ఎందుకు’ అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ.
బాబు కుటుంబం భూ కబ్జా విలువ రూ.10 వేల కోట్లు..
విశాఖలో చంద్రబాబు కుటుంబం కబ్జా చేసిన భూముల విలువ రూ.10 వేల కోట్లని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ‘ఇప్పటికే గీతం కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చారు. ఇప్పడు మరో రూ.5 వేల కోట్ల విలువ చేసే భూములను కట్టబెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా గీతం సంస్థ 130 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసింది. ఒక్క విద్యా సంస్థ పేరిట రూ. పది వేల కోట్లు కొట్టేస్టే అడిగే నాథుడే లేడు. 2005 నుంచి మా కబ్జాలోనే ఉన్న ప్రభుత్వ భూమిని తీసుకుంటే తప్పేంటని సాక్షాత్తూ ఎంపీ భరతే అంటున్నారు. కబ్జా చేస్తే భూమి సొంతమై పోతుందా? గీతం భూ కబ్జా క్రమబద్ధీకరణ వ్యవహారాన్ని జీవీఎంసీ కౌన్సిల్‌ నుంచి పార్లమెంట్‌ వరకు తీసుకెళ్తాం. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం’ అని కన్నబాబు చెప్పారు.
ఎంపీ భరత్‌ది బరితెగింపే..
విశాఖ ఎంపీ, గీతం చైర్మన్‌ భరత్‌ గతంలో 72 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో క్రమబద్ధీకరకించుకున్నారు. ఇప్పుడు మళ్లీ రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారు. ఎంపీ భరత్‌ బరి తెగించి కబ్జా చేసిన భూమి తమ అధీనంలోనే ఉందని, క్రమబద్ధీకరించుకుంటే తప్పేంటని అంటున్నారు. దీనిపై సీబీఐతో ఎంక్వయిరీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. కూటమి వచ్చాక విశాఖలో రూ.25 వేల కోట్ల విలువైన భూములను రూపాయి నుంచి లక్షకే కట్టబెట్టారు. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తోంది. ఎంపీ భరత్‌పై భూకబ్జా కేసు నమోదు చేయాలి. జీవీఎంసీ అజెండా ఆమోదానికి, రెగ్యులరైజేషన్‌కు వీల్లేదు’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు.
Read More
Next Story