
అల్లూరి కొండల్లో ట్రెక్కర్లు
అల్లూరి కొండల్లో ట్రెక్కింగ్, హైకింగ్‌కు ప్రమోషన్!
ఆదివారం నాటి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లూరి జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై తీపి కబురు చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ట్రెక్కింగ్, హైకింగ్‌లకు మంచి రోజులు రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్, హైకింగ్ (కొండలపై నడక)లను విస్తృతం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి పరుస్తామని చెప్పారు. దీంతో సహజ సౌందర్యంతో అలరారే అల్లూరి జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొండల్లో ఊటగెడ్డలను దాటుకుంటూ..
అందాలన్నీ అల్లూరి జిల్లాకే సొంతం..
ఆంధ్రప్రదేశ్‌లో మరెక్కడా లేనంత ప్రకృతి రమణీయత అల్లూరి సీతారామరాజు జిల్లా సొంతం. అక్కడి కొండకోనలు, హొలయొలికించే లోయలు, జలజలపారే జలపాతాలు.. ఇలా ఒకటేమిటి? లెక్కకు మిక్కిలి పర్యాటక సోయగాలు కనువిందు చేస్తాయి. అందుకే అందాల అరుకులోయ, పాడేరు, చింతపల్లి, అనంతగిరి, టైడా జంగిల్ బెల్స్ వంటి ఎన్నో ప్రదేశాలు ఇందుకు ఆలవాలంగా ఉన్నాయి. అరకు అందాలు, పాడేరు కాఫీ తోటలు, కాశ్మీరాన్ని తలపించే శీతల లంబసింగి, బొర్రా గుహలు, కటికి, తారాబు, కొత్తపల్లి తదితర జలపాతాలు మైమరపిస్తాయి. దేశ విదేశాల నుంచి పర్యాటక ప్రియులు ఏటా లక్షల్లో అక్కడకు వచ్చి అక్కడున్న అందాలను తనివితీరా ఆస్వాదిస్తుంటారు. రోజుల తరబడి మన్యంలోనే గడుపుతూ మురిసిపోతుంటారు.
జలపాతాల్లో ఎంజాయ్ చేస్తున్న ట్రెక్కర్లు
ట్రెక్కింగ్‌పై పెరుగుతున్న మోజు..
ఒకపక్క నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు అల్లూరి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. మరోపక్క మరికొందరు ఔత్సాహికులు కొన్నాళ్లుగా ట్రెక్కింగ్‌పై కూడా మోజు పెంచుకుంటున్నారు. ఎల్తైన కొండల్లోకి దట్టమైన అడవులను చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. మధ్య మధ్యలో కనిపించే అరుదైన అడవి జంతువులను చూసి భయం, ఆనందం కలగలిసిన అనుభూతిని పొందుతుంటారు. ఒకప్పుడు అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్ అంటే భయపడే వారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. అడ్వెంచర్ స్పోర్ట్సులో భాగమైన ట్రెక్కింగ్‌కు పోటీ పడే వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. అల్లూరి అందాలను తిలకించడానికి వెళ్తున్న వారిలో కొందరు ట్రెక్కింగ్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు.
కొండకోనల్లో బండరాళ్లను దాటుకుంటూ వెళ్తున్న ట్రెక్కర్లు
రూ.2000–6000 వరకు ప్యాకేజీలు..
అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్న వారి కోసం ప్రైవేటు ట్రెక్కింగ్ ఆపరేటర్లు వివిధ ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడి అడవుల్లో ఒకట్రెండు రోజులు ట్రెక్కింగ్ నిర్వహించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి 6 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీరికి టెంట్లు, ఆహారం, కాంప్‌ఫైర్ వంటివి సమకూరుస్తున్నారు. వీరికి గైడ్లు, వాలంటీర్లు సహకరిస్తారు. ప్రస్తుతం ఆ జిల్లాలో అరమకొండ (పాడేరు), గాలికొండ (అరకు), బొర్రాగుహలు (అనంతగిరి), సీక్రేట్ వాటర్ ఫాల్, గుర్రాయి వాటర్ ఫాల్ (జి.మాడుగుల), తారాబు వాటర్ ఫాల్ (పెదబయలు), తూర్పు కనుమల్లోనే అత్యంత ఎత్తులో ఉన్న జిందగుడ వాటర్ ఫాల్‌లకు ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు.
ఐదారేళ్ల నాటి ప్రతిపాదనకు మోక్షం..
ఇలా అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన పర్యాటక శాఖ దాదాపు ఐదారేడేళ్ల క్రితమే ట్రెక్కింగ్ సదుపాయాలను విస్తృతం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. వీటిలో గాలికొండ, వంజంగి, జెండా కొండ, లంబసింగి, ముంచంగిపుట్టు తదితర అటవీ ప్రాంతాలను ఎంపిక చేసింది. ట్రెక్కింగ్‌ను టూర్ ఆపరేటర్ల ద్వారా ప్రమోట్ చేయాలని భావించింది. అయితే ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్‌లో అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్, హైకింగ్‌ను ప్రమోట్ చేస్తామన్న ప్రకటన ట్రెక్కింగ్, పర్యాటక ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది.
ట్రెక్కింగ్‌ను ప్రమోట్ చేస్తే..
బడ్జెట్‌లో ట్రెక్కింగ్ ప్రమోషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పుకోదగినంతగా నిధులు విడుదలవుతాయి. వాటితో ప్రస్తుతం ఉన్న ట్రెక్కింగ్ పాయింట్లను మరింతగా అభివృద్ధి చేయవచ్చు. ప్రస్తుతం చాలా చోట్ల ట్రెక్కింగ్‌కు వెళ్లాలంటే సరైన దారుల్లేవు. రాళ్లు, రప్పలు, తుప్పలు, డొంకలతో జీమూతను తలపించేలా ఉన్నాయి. వీటన్నిటినీ క్లియర్ చేయాలన్నా, ఇతర సదుపాయాలు సమకూర్చాలన్నా నిధులు అవసరమవుతాయి. ఈ నిధులతో కొత్తగా మరిన్ని ట్రెక్కింగ్ పాయింట్ల ఏర్పాటుకు కూడా వీలుంటుంది. ఫలితంగా పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగేందుకు దోహదపడుతుంది.
అల్లూరి జిల్లా పర్యాటక అధికారి దాస్
పర్యాటకం ఊపందుకుంటుంది..
‘ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే ఇటీవల ట్రెక్కింగ్‌పై కూడా పర్యాటకులకు ఆసక్తి పెరుగుతోంది. రానురాను ఇతర ప్రాంతాల నుంచి ట్రెక్కింగ్‌కు వస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. బడ్జెట్‌లో అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్, హైకింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రకటించడం సంతోషించదగ్గ పరిణామం’ అని అల్లూరి జిల్లా పర్యాటక అధికారి దాస్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
ట్రెక్‌సమ్ సంస్థ సీఈవో సామ్‌వేద్
ట్రెక్కింగ్‌పై అవగాహన పెరుగుతోంది..
అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్ చేయాలన్న కుతూహలం పర్యాటకుల్లోనూ, సందర్శకుల్లోనూ ఊపందుకుంటోంది. మేం వారంతాల్లో ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నాం. ఒక్కో బ్యాచ్‌కు ఐదు. పది, ఇరవై మంది చొప్పున ఉంటారు. వీరికి అనువైన ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతున్నాం. గతంలో ట్రెక్కింగ్‌పై విశాఖలో అవగాహన కల్పించే వారం. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండానే ట్రెక్కింగ్‌కు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు’ అని ట్రెక్‌సమ్ సంస్థ సీఈవో సామ్‌వేద్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి వివరించారు.
Next Story

