
హమీలకు ఆదేశాలు ఇస్తేనే రెండో దశ పూలింగ్ పై ముందుకు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై రైతుల్లో ఎన్నో అనుమానాలు. హామీలకు గ్యారంటీ ఎక్కడ అని వారు ప్రశ్నిస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో రైతులు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమి అభివృద్ధి కాలపరిమితి, ప్లాట్లు కేటాయింపు, పరిహారం పెంపు, భూసమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై స్పష్టత లేకపోవడంతో రైతుల స్పందన తక్కువగా ఉంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు సభలు నిర్వహించి ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ, రైతులు హామీలు కోరుతున్నారు.
రెండో దశ పూలింగ్ ప్రారంభమైన తర్వాత మంత్రి, అధికారులు రైతుల నుంచి భూమి పట్టాల జిరాక్స్ కాపీలు సేకరించి భారీ స్పందన వచ్చినట్టు ప్రకటించారు. మద్దూరు, యండ్రాయి ప్రాంతాల్లో అనూహ్య స్పందన ఉందని ప్రకటనలు చేశారు. తర్వాత రైతుల్లో సందేహాలు పెరిగాయి. ఎప్పటిలోపు భూములు అభివృద్ధి చేస్తారు? ప్లాట్లు ఎక్కడ, ఎలా కేటాయిస్తారు? భూసమస్యలు ఎలా పరిష్కరిస్తారు? అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి. గత పూలింగ్ తర్వాత ప్రభుత్వ మార్పుతో అభివృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో, చట్టపరమైన గ్యారంటీ కావాలని రైతులు కోరుతున్నారు. దరఖాస్తు, అగ్రిమెంటులో కాలపరిమితి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ సభలో అధికారులతో మాట్లాడుతున్న రైతులు
ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఏ భూములు కేటాయిస్తారు...
ప్లాట్లు కేటాయింపుపై కూడా రైతుల్లో సందేహాలు ఉన్నాయి. వడ్డమాను పశ్చిమ దిశగా, పెదమద్దూరు కొండ తూర్పు దిశగా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఈ రోడ్డుకు ఏ వైపు భూములు కేటాయిస్తారనే స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం పెంపుపై గత సభల్లో రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎకరాకు రూ.30 వేలు మాత్రమే కౌలు సాయం ఇస్తున్నారని, జీఓ ఇస్తేనే నమ్మకం వస్తుందని అంటున్నారు. రుణమాఫీపై కూడా అసంతృప్తి ఉంది. రూ.1.50 లక్షలు ప్రకటించినా, చాలామంది రైతులకు రూ.8 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు.
పాస్ పుస్తకాలు ఇచ్చి రసీదు తీసుకోవాలన్నా...
క్యాపిటల్ అథారిటీ అధికారులు ముందు పాస్ బుక్స్ ఇచ్చి రసీదులు తీసుకోవాలని కోరుతున్నారు. అయినా స్థానిక రైతుల నుంచి స్పందన తక్కువగా ఉంది. మరోవైపు గతంలో భూములు కొనుగోలు చేసిన ఇతర ప్రాంతాల వ్యాపారులు ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారు. పెదమద్దూరులో 330 ఎకరాలు, యండ్రాయిలో 240 ఎకరాలు టీడీపీ నాయకుల కుటుంబాల భూములు ఉన్నాయి. అక్కడ కూడా 100 ఎకరాల వరకు వ్యాపారులు పూలింగుకు ముందుకు వచ్చారు. హరిశ్చంద్రాపురం, పెదపరిమి, వైకుంఠపురం గ్రామాల్లో ఇంకా సమీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
రైతుల్లో నిరాసక్తి
శనివారం నాటికి వడ్డమానులో 22 ఎకరాలు, పెదమద్దూరులో 113 ఎకరాలు, యండ్రాయిలో 132 ఎకరాలు, కర్లపూడిలో 104 ఎకరాలు పూలింగ్ కు ఇచ్చారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవతో పూలింగ్ జరుగుతున్నప్పటికీ, రైతులు ముందుకు రాకపోవడంతో ఆయన రైతులను కలిసి త్వరగా భూములు ఇవ్వాల్సిందిగా కోరారు. కర్లపూడిలో రైల్వే ప్రాజెక్టు పేరుతో పూలింగుకు తీసుకోవాలని 2024 సెప్టెంబర్ 19న సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. వడ్డమానులో ఎమ్మెల్యే రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. అదనపు కమిషనర్ భార్గవతేజ సమావేశంలో ప్లాట్ల విస్తీర్ణం పెంపు సాధ్యం కాదని, పరిహారం అంశం సీఎం పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేతో చర్చ
పెదమద్దూరులో జరిగిన సభలో ఎమ్మెల్యే, రైతుల మధ్య చర్చ జరిగింది. వాగు భూములను తక్కువ చేసి మాట్లాడొద్దని రైతులు అన్నారు. తమ తరతరాలుగా ఆ భూములపై బతుకుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే చమత్కారంగా స్పందిస్తూ మీకు కూడా లాభం కలుగుతుందని అన్నారు. ఎకరం భూమి ట్రస్టుకు ఇవ్వాలని, అన్నదమ్ముల మధ్య పంపకాలు పరిష్కరించాలని రైతులు కోరారు. వివాద భూములను మినహాయించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ విస్తరణపై ఎమ్మెల్యే భవిష్యత్ అవసరాల కోసం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం సీఆర్‌డీఏ అధికారులు రైతుల సందేహాలు నివృత్తి చేసి హామీలు ఇస్తేనే పూలింగ్ వేగవంతమవుతుందని రైతులు అంటున్నారు. లేకుంటే ప్రక్రియలో మరింత జాప్యం తప్పదని అంచనా.

