
మళ్లీ ముగ్గురిని బలి తీసుకున్న ప్రైవేట్ బస్సు
అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కందుకూరు, కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాదాల నుంచి రాష్ట్ర ప్రజలకు తేరుకోక ముందే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 12 గంటల ప్రాంతంలో పోతిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.
మృతుల వివరాలు
మృతులను ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), గోవిందు (25) , పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారి దుర్గాప్రసాద్ (16)గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, 16 ఏళ్ల దుర్గాప్రసాద్ ఇంకా చదువుకుంటున్నట్లు సమాచారం. చిన్న వయసులోనే ముగ్గురు యువకులు మృత్యువాత పడటంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
పోలీసుల దర్యాప్తు
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతి వార్తను వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
Next Story

