పట్టాలపైనే ప్రసవించిన గర్భిణీ!
x
బెల్గాం స్టేషన్‌ వద్ద పట్టాలపైనే ప్రసవించిన ప్రియా పాత్రో

పట్టాలపైనే ప్రసవించిన గర్భిణీ!

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నెలలు నిండిన ఓ గర్భిణి రైలు పట్టాలపైనే ప్రసవించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.

గర్భం దాల్చిన మహిళలు తమ ప్రయాణం మార్గమధ్యలో అరుదుగా ప్రసవిస్తుంటారు. బస్సుల్లోనూ, రైళ్లలోనూ, విమానాల్లోనూ ప్రయాణిస్తుండగా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా బెల్గాం స్టేషన్‌ వద్ద జరిగింది. అయితే ఆ మహిళ రైలులో కాకుండా పట్టాలపైనే ప్రసవించడం విశేషం! ఆసక్తి రేపే ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


ప్రసవానంతరం తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించేందుకు సన్నద్ధమవుతూ

ఒడిశాలోని బరంపురం (బ్రహ్మపుర)కు చెందిన ప్రియా పాత్రో (31) అనే మహిళ నిండు గర్భిణి. మరికొద్ది నెలల్లోనే ఆమెకు నెలలు నిండనున్నాయి. పుట్టింట్లో పురుడు పోసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ఉదయం బ్రహ్మపుర నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో ఆమెకు రైలులోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని కోచ్‌లోని టిక్కెట్‌ కలెక్టర్‌ (టీసీ) ద్వారా గార్డుకు తెలియజేశారు. ఇంతలో రైలు పార్వతీపురం సమీపానికి వచ్చే సరికి ఆమెకు ప్రసవ నొప్పులు తీవ్రమై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో రైలును పార్వతీపురం సమీపంలోని బెల్గాం స్టేషన్‌ వద్ద అత్యవసరంగా నిలిపివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, సాటి మహిళా ప్రయాణికుల సాయంతో రైలు బోగీ నుంచి ప్రియా పాత్రను నెమ్మదిగా కిందకు దింపారు.

ప్రసవమైన బిడ్డను బయటకు తీస్తున్న దృశ్యం

పట్టాలు దాటిస్తుండగానే ప్రసవం..
గర్భిణి ప్రియా పాత్రను రైలు నుంచి దించి, పట్టాల పైనుంచి దాటిస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు మరింత అధికమయ్యాయి. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను అక్కడే కూర్చుండబెట్టగా ఉన్నఫళంగా పట్టాలపైనే మగ బిడ్డను ప్రసవించింది. ఇంతలో రైల్వే సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఆ పట్టాలపైకి కాసేపు రైళ్లు రాకుండా చర్యలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు స్థానికులు, రైల్వే సిబ్బంది తల్లీబిడ్డలిద్దరినీ ఆటోలో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిని పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. దీంతో ప్రియా పాత్ర కుటుంబ సభ్యులు హమ్మయ్యా! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందపరవశులయ్యారు.
Read More
Next Story