’పెళ్లికూతురిని చేస్తామనుకుంటే..పాడె ఎక్కించావామ్మా‘
x

’పెళ్లికూతురిని చేస్తామనుకుంటే..పాడె ఎక్కించావామ్మా‘

తాపీ మేస్త్రీ గోపాలరావు, శిరీష దంపతుల పెద్ద కుమార్తె ప్రవల్లిక చదువులో చురుగ్గా ఉండేది.


మరో పది రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి. పచ్చని పందిరి కింద ఆ అమ్మాయి పెళ్లికూతురు కావాలి. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఐటీ రెండో సంవత్సరం చదువుతున్న కింతలి ప్రవల్లిక (19) బుధవారం రైలు కింద పడి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సంతోషాల నడుమ పిడుగులాంటి వార్త
నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ గోపాలరావు, శిరీష దంపతుల పెద్ద కుమార్తె ప్రవల్లిక. చదువులో చురుగ్గా ఉండే ప్రవల్లికకు కుటుంబ సభ్యులు సంబంధం నిశ్చయించారు. ఈ నెల 27వ తేదీన ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, బుధవారం ఉదయం ఎప్పట్లాగే కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక సాయంత్రం రాజారాణి ఎక్స్‌ప్రెస్ కింద పడి ప్రాణాలు వదిలింది.
ఘటనా స్థలంలో గుండె కోత
టెక్కలి మండలం తలగాం సమీపంలో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉన్న ప్రవల్లికను చూసి స్థానికులు చలించిపోయారు. ఆమె వద్ద ఉన్న ఐడీ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని, విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. ’పెళ్లికూతురిని చేస్తామనుకుంటే.. పాడె ఎక్కించావామ్మా‘ అంటూ వారి ఆక్రందనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి.
వీడని మిస్టరీ.. ఎన్నో ప్రశ్నలు
ప్రవల్లిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ ముగిసిన తర్వాత ఆమె నందిగాం వైపు వెళ్లే బస్సు ఎక్కాల్సి ఉండగా, అసలు సంబంధం లేని నౌపడ రూట్‌లోని తలగాం వైపు ఎందుకు వెళ్లింది? వివాహం నిశ్చయమైన సంతోషంలో ఉండాల్సిన విద్యార్థిని ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె, ఇంజినీరింగ్ చదువుతూ ఉన్నత శిఖరాలకు చేరుతుందని భావిస్తే.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వేణుగోపాలపురం గ్రామంలో విషాదం నిండిపోయింది.
Read More
Next Story