
Pope Francis
కేథలిక్ పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, కొత్త పోప్ ఎంపిక ఎప్పుడంటే..
ప్రపంచంలో అతి పెద్ద మతమైన కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు.
ప్రపంచంలో అతి పెద్ద మతమైన కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్లు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల కేథలిక్కులకు ఆధ్యాత్మిక అధిపతిగా ఉన్నారు. 2013లో పోప్ అయినప్పటి నుంచి కాథలిక్ చర్చికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
ఏప్రిల్ 20న ఈస్టర్ నాడు ఆదివారం కొద్దిసేపు భక్తులకు కనిపించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్‌ని కూడా కొద్దిసేపు కలిశారు.
ఆయన కొన్ని వారాలుగా అనారోగ్యంతో ఉన్నారు. మార్చి 24న, పోప్ ఫ్రాన్సిస్ వాంతులు, విరేచనాలు బాధ పడ్డారు. శ్వాసకోశవ్యాధులు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. చికిత్స తర్వాత కొంత మెరుగైనట్టు కనిపించినా ఏప్రిల్ 21న కన్నుమూశారు.
పోప్ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన కొద్దిసేపటికే, వాటికన్ అధికారులు ఆయన మరణాన్ని ధృవీకరించే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ బాధ్యత సాధారణంగా వాటికన్ ఆరోగ్య శాఖ, కామెర్‌లెంగోకు చెందుతుంది. ఆయన మృతిని ధృవీకరించిన తర్వాత పోప్ మృతదేహాన్ని ఆయన ప్రైవేట్ ప్రార్థనా మందిరానికి తరలించడం ఆచారం.
అక్కడ, ఆయన భౌతికకాయానికి తెల్లటి వస్త్రం చుట్టి జింక్‌తో కప్పబడిన చెక్క శవపేటికలో ఉంచుతారు.
9 రోజుల సంతాపదినాలు...
పోప్ మృతికి వాటికన్ తొమ్మిది రోజుల సంతాప దినాలను ప్రకటించే అవకాశం ఉంది, దీనిని నోవెండియల్ అని పిలుస్తారు. మధ్యలో, ఇటలీ జాతీయ సంతాప దినాన్ని ప్రకటించవచ్చు. ఈ తొమ్మిది రోజులలో, పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులు అర్పించేందుకు, ఆయన మృతికి సంతాపం తెలిపేందుకు కాథలిక్కులు అనుమతించే వివిధ సేవలు, స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంతాప కాలంలో, వాటికన్ సెడే అంటే ఆయన సీటు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో వాటికన్ పాలన అంతా కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ చేతుల్లో ఉంటుంది. కార్డినల్స్ సాధారణ విషయాలను నిర్వహిస్తారు. కొత్త పోప్ ఎన్నికయ్యే వరకు ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోరు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేది త్వరలో ప్రకటిస్తారు. సాధారణంగా మరణించిన నాలుగు నుంచి ఆరు రోజుల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. తొమ్మిది రోజుల వరకు అదనపు వేడుకలు జరుగుతాయని భావిస్తున్నారు.
పోప్ అంత్యక్రియలు చాలా పెద్ద ప్రక్రియ. అతని హయాంలో ముద్రించిన నాణేల సంచి, రోగిటో అని పిలిచే ఒక పత్రాన్ని శవపేటికలో ఉంచవచ్చు. పోప్ జీవితం, విజయాలను వివరించే రోగిటో సాంప్రదాయకంగా శవపేటికను మూసివేయడానికి ముందు చదువుతారు.
అంత్యక్రియల సమయంలో, పోప్ ముఖంపై తెల్లటి పట్టు వస్త్రాన్ని ఉంచిన తర్వాత శవపేటికకు సీలు వేయడం ఆచారం-ఇది జీవితం నుండి శాశ్వతమైన విశ్రాంతికి మారడాన్ని సూచించే సంకేతం.
కొత్త పోప్ ఎంపికకు మహాసమ్మేళనం
అంత్యక్రియలు, ఖననం పూర్తయిన తర్వాత, తదుపరి ముఖ్యమైన దశ పాపల్ కాన్ క్లేవ్. పోప్ మరణించిన 15 నుండి 20 రోజుల తర్వాత ఈమహాసమ్మేళనం జరుగుతుంది. ఈ మధ్యంతర కాలంలో, చర్చిని తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్న కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి సిద్ధమవుతుంది.
కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ ప్రస్తుత డీన్ అయిన 91 ఏళ్ల కార్డినల్ గియోవన్నీ బాటిస్టా రే ఈ కాన్క్లేవ్ అధ్యక్షత వహిస్తారని భావిస్తున్నారు.
80 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు దాదాపు 120 మంది కొత్త పోప్ ఎన్నికకు జరిగే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. ఎన్నికలు సిస్టీన్ చాపెల్‌లో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతాయి.
డీన్ సాధారణంగా కాన్క్లేవ్‌ను పర్యవేక్షిస్తారు. అయితే కార్డినల్‌కు 80 ఏళ్లు పైబడినందున, అతనికి ఓటు వేయడానికి అర్హత ఉండదు. ఈ సందర్భంలో ఆయన స్థానంలో సబ్-డీన్ లేదా యువ సీనియర్ కార్డినల్ తీసుకునే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియలో బహుళ రౌండ్ల ఓటింగ్ ఉంటుంది. ఒక రౌండ్‌లో ఏ అభ్యర్థికీ అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోతే, బ్యాలెట్‌లను సేకరించి కాల్చివేస్తారు. చిమ్నీ నుండి విడుదలైన పొగ ద్వారా ఫలితం సూచించబడుతుంది. నల్ల పొగ ఏ నిర్ణయానికి రాలేదని సూచిస్తుంది. తెల్ల పొగ వస్తే కొత్త పోప్ ఎన్నికైనట్లు సూచిస్తుంది. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో వేలాది మంది గుమిగూడి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించే ముందు కొత్త పోప్ ఎన్నిక ప్రకటన వెలువడుతుంది. ఇది చర్చికి కొత్త శకాన్ని తెలియజేస్తుంది.
ఫ్రాన్సిస్ జన్మస్థలం అర్జెంటీనా..
ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.
మరణానికి కొన్ని గంటల ముందు కూడా..
పోప్ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్‌లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు. ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్..!’ అని పోప్ స్వయంగా చెప్పారు. అనంతరం ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
ప్రముఖుల సంతాపం..
పోప్ మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఇప్పటికే సంతాపం ప్రకటించారు.
‘‘పోప్ మరణ వార్త ఇప్పుడే తెలిసింది. నేను ఆయన్ను నిన్నే కలిశాను. కొవిడ్ తొలినాళ్లలో ఆయన ప్రసంగాలను నేను మర్చిపోలేను. అవి చాలా అద్భుతమైనవి’’- జేడీ వాన్స్ (అమెరికా ఉపాధ్యక్షుడు)
‘‘పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధాకరం. మిలియన్ల మంది కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా గుర్తుండిపోతారు. చిన్న వయసు నుంచే ఆయన క్రీస్తు ఆశయాల కోసం పనిచేశారు. పేదలు, విధివంచితుల కోసం ఆయన సేవలు చేశారు. బాధితుల్లో ఆయన ఆశ అనే స్ఫూర్తిని రగిలించారు. నేను ఆయనతో భేటీ అయినప్పుడు.. అన్నివిధాలా, సమ్మిళిత అభివృద్ధి విషయంలో నిబద్ధత నన్ను ప్రభావితం చేసింది. భారత ప్రజలపై ఆయన అభిమానం ఎంతో విలువైంది’’ - నరేంద్ర మోదీ
‘‘నేడు పోప్ ప్రానిస్స్ మరణానికి ప్రపంచం సంతాపం తెలియజేస్తోంది. విధివంచితుల విషయంలో ఆయన ప్రేమ, మానవత్వం కేథలిక్ ప్రపంచానికి వెలుపల కూడా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. - ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ (ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు)
‘‘పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటు. ఆయన కరుణ, ప్రేమకు ప్రతిరూపం. సత్యం కోసం ఎప్పుడూ నిలబడ్డారు. అన్యాయాలపై నిర్భయంగా మాట్లాడారు. పేదలు, అణగారిన వర్గాలపై చాలా శ్రద్ధ చూపించారు. మరింత శాంతియుత, దయామయ ప్రపంచాన్ని కోరుకొనే లక్షల మందికి ఆయనో స్ఫూర్తిదాత’’ - ప్రియాంకా గాంధీ.
Next Story