పేదల వైద్య నారాయణుడు కన్నుమూశాడు!
x
సుంకర ఆదినారాయణరావు

పేదల వైద్య 'నారాయణుడు' కన్నుమూశాడు!

ఎముకలు, పోలియో వైద్య నిపుణుడిగా దేశంలో ఖ్యాతిగాంచి, పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ సుంకర ఆదినారాయణరావు అస్తమించారు.

పోలియో మహమ్మారి అంటేనే ఠక్కున గుర్తుకొచ్చేది ఆయన పేరే. ఎలాంటి పోలియో వైకల్యాన్నైనా ఇట్టే నయం చేయగల నైపుణ్యం ఆయన సొంతం. అంతేకాదు.. ఎముకల సర్జరీలోనూ దేశ, విదేశాల్లో సైతం తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. వేల సంఖ్యలో పోలియో, ఎముకల శస్త్రచికిత్సలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలతో పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయనే డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు. తన 87వ ఏట శనివారం విశాఖలో కన్నుమూశారు. లెక్కకు మిక్కిలి పోలియో బాధితుల కాళ్ల వంకరలను సరిచేసిన సుంకర
జీవన ప్రస్థానం ఎలా సాగిందంటే?
భీమవరం నుంచి విశాఖ వచ్చి..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సుంకర ఆదినారాయణరావు.. శేషమ్మ, కనకం దంపతులకు 1939 జూన్ 30న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు స్వాతంత్ర సమరయోధులు. ఆదినారాయణ అక్కడే పాఠశాల విద్య, ఇంటర్ చదువు పూర్తి చేసి 1960లో విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ లో చేరారు. ఆ తర్వాత 1970లో అదే కళాశాల నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. ఆపై జర్మనీ వెళ్లి మైక్రోవాస్కులర్, హ్యాండ్ సర్జరీలో శిక్షణ పొందారు. విశాఖ కేజీహెచ్ ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గాను, రాణి చంద్రమణి దేవి (ఆర్సీడీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ గానూ పనిచేశారు. అప్పట్లో విశాఖ కేజీహెచ్ ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ వ్యాఘ్రశ్వరుడు పోలియో ఆపరేషన్లు చేయడంలో ప్రావీణం సంపాదించారు. ఆయన వద్ద ఆదినారాయణరావు శిష్యుడిగా చేరారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నారు.
తొలిసారి 1978లో పాలకొల్లులో
తొలిసారి తొమ్మిది మందితో మొదలై.. గురువు వ్యాఘేశ్వరుడి సూచనతో సత్యనారాయణమూర్తి అనే వైద్యుడి సాయంతో తొలిసారి తొమ్మిది మందికి పోలియో శస్త్రచికిత్సలు చేశారు డాక్టర్ ఆదినారాయణ. అప్పట్లో పుట్టపర్తిలో పోలియో క్యాంపు నిర్వహించినప్పుడు భగవాన్ సత్యసాయిబాబా స్వయంగా పరిశీలించి అభినందించారు. అదే సాయిబాబా పోలియో ఆపరేషన్ల గురించి చెప్పడంతో గుజరాత్కు చెందిన జైన్ అనే భక్తుడు స్ఫూర్తి పొందారు. డాక్టర్ ఆదినారాయణను గుజరాత్ రావాలని షా కోరడంతో అక్కడ క్యాంపు నిర్వహించి 220 మందికి పోలియో ఆపరేషన్లు చేశారు. అనంతరం దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో క్యాంపులు నిర్వహించి పెద్ద ఎత్తున పోలియో శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశారు. గుజరాత్ సీఎంలు శంకర్సింగ్ వాఘేలా, కేశూభాయ్పటేల్, కేంద్రమంత్రి మేనకాగాంధీ (ఉత్తరప్రదేశ్లో) వంటి వారు పోలియో క్యాంపులు ఏర్పాటు చేసి ఆదినారాయణను ఆహ్వానించారు. ఒకపక్క దేశంలో పలు ప్రాంతాల్లో పోలియో క్యాంపులు నిర్వహస్తూనే విశాఖలో 'ప్రేమ ఆస్పత్రి'ని స్థాపించి పోలియో, ఇతర ఆపరేషన్లు చేస్తూ వచ్చారు.
మూడు లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు..
డాక్టర్ ఆదినారాయణ తాను వైద్య వృత్తిని చేపట్టాక మూడు లక్షలకు పైగానే పోలియో ఆపరేషన్లు, 989 పోలియో వైద్య శిబిరాలు నిర్వహించి దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపు పొందారు. తాను అంతమందికి శస్త్రచికిత్సలు చేస్తానని ఏనాడూ అనుకోలేదని చెప్పేవారు. కుంటుకుంటూ తన వద్దకు వచ్చిన రోగులు ఆపరేషన్ చేశాక, ఫిజియోథెరపీ అనంతరం నడుచుకుంటూ వెళ్లడం జీవితంలో మరచిపోలేని మధురానుభూతిని పొందేవాడినని మీడియాకు, సన్నిహితులకు చెబుతుండేవారాయన.
ఆదినారాయణ సేవలకు పద్మశ్రీ..
డాక్టర్ సుంకర ఆదినారాయణ వైద్యరంగంలో ముఖ్యంగా పోలియో బాధితులకు అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీని ప్రకటించింది. తన గురువు డాక్టర్ వ్యాఘ్రశ్వరుడే తనకు స్ఫూర్తి అనే వారాయన. తాను శస్త్ర చికిత్సలు చేసేందుకు అవసరమైన సొమ్మును సమకూర్చిన దాతలకు కృతజ్ఞతలు చెప్పేవారు డాక్టర్ ఆదినారాయణ. ఆయన భార్య డాక్టర్ శశిప్రభ కూడా వైద్యురాలే. ఆమె కేజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. భర్త సేవాతత్పరతలో ఆమె వెన్నుదన్నుగా నిలిచారు. ఆదినారాయణరావుకు కుమార్తె శేషకమల్, కుమారుడు శశికిరణ్లున్నారు. వీరు ఇంగ్లండ్లో స్థిరపడ్డారు.

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అందుకుంటున్న ఆదినారాయణరావు

వైద్యనారాయణుడికి దక్కిన సత్కారాలు..
జాన్సన్ అండ్ జాన్సన్ ఫెలోషిప్.
+ ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఏపీ పూర్వ అధ్యక్షుడు.
+ వికలాంగుల పునరావాసానికి చేసిన ఉత్తమ సేవలకు జాతీయ అవార్డు + సామాజిక సేవలకు దీపావళి బెన్ మోహన్లాల్ మెహతా అవార్డు.
+ సామాజిక సేవారంగంలో ప్రతిష్టాత్మక భగవాన్ మహావీర్ అవార్డు.
+ వివిధ రాష్ట్రాల్లో ఉచిత పోలియో శస్త్రచికిత్సలు నిర్వహించినందుకు ప్రభుత్వేతర సంస్థల నుంచి వందకు పైగా బిరుదులు.
+ భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారం.
+ ఇంకా మరెన్నో అవార్డులు.. సత్కారాలు అందుకున్నారు ఆదినారాయణరావు.
Read More
Next Story