
నిందితుణ్ణి పోలీసులు పట్టుకున్నట్టున్న ఊహాత్మక చిత్రం
ఆ బాలిక గొంతుకోసి చంపిన ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు
తప్పించుకునేందుకు చూస్తే కాళ్లపై కాల్పులు జరిపామన్న పోలీసులు
కడప జిల్లా ఖాజీపేటలో ఒ బాలికను అతికిరాతకంగా గొంతుకోసి చంపిన కేసులో నిందితుడు వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు ఏమన్నారంటే...
నిందితుడు వెంకటేశ్‌ను మైదుకూరు నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా, అతడు ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచాడని పోలీసులు చెప్పారు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు తొలుత గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి హెచ్చరించారు.
అయినప్పటికీ వినకపోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లపైకి కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన వెంకటేశ్‌ను వెంటనే కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రేమ పేరుతో వేధింపులు..
ఖాజీపేట అగ్రహారానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిని (17), ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని అతడు పెట్టిన ఒత్తిడిని ఆ బాలిక నిరాకరిస్తూ వచ్చింది.
దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దాడికి తెగబడ్డాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, ఆమె ససేమిరా అనడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయ్యాడు.
మరణానికి ముందు నిందితుల పేర్లు వెల్లడి
రక్తపు మడుగులో ఉన్న తన కుమార్తెను తండ్రి శ్రీనివాసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో కొనఊపిరితో ఉన్న ఆ బాలిక.. వెంకటేశ్, ప్రవీణ్ అనే ఇద్దరి పేర్లను తండ్రికి చెప్పింది. మరింత సమాచారం ఇచ్చేలోపే పరిస్థితి విషమించి చెన్నూరు వద్ద ఆమె ప్రాణాలు విడిచింది.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Next Story

