
ఆశల గాలం..అప్పుల జాలం: కత్తుల నీడలో నెల్లూరు ’బెట్టింగ్‘ సామ్రాజ్యం
ఈ ముఠా స్థావరాలపై పోలీసులు నిర్వహించిన సోదాల్లో లభించిన సొమ్ము చూసి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
’తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించవచ్చు.. ఒక్క పెట్టుబడితో మీ తలరాత మారిపోతుంది‘ ఈ ఒక్క మాటతో వందలాది మంది యువతను ఆశల గాలానికి చిక్కించి, వారి జీవితాలను అప్పుల జాలంలోకి నెట్టేసిన ఒక భయంకరమైన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని నెల్లూరు పోలీసులు మట్టుబెట్టారు. అక్రమ క్రికెట్ బెట్టింగ్‌లు, మాయా ఇన్వెస్ట్‌మెంట్లతో సాగుతున్న ఈ నయా మాఫియా.. డబ్బు అడిగితే కత్తులతో దాడికి తెగబడేంత క్రూరత్వానికి తెరలేపింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా సాగుతున్న ఈ చీకటి సామ్రాజ్యం గుట్టును జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల నేతృత్వంలోని పోలీసుల బృందం సాహసోపేతంగా ఛేదించింది.
మాయగాళ్ల వేట.. మాఫియా నాయకుల అరెస్ట్
ఈ అక్రమ దందాలో కీలక పాత్రధారులైన కూసెట్టి వేణుగోపాల్, బిట్ర వెంకటరమణలను పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఒక పద్ధతి ప్రకారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించి, ముఖ్యంగా చదువుకున్న యువతను, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ అనే ముసుగులో వారు ఆశ చూపిన ఈజీ మనీ వైపు ఆకర్షితులైన యువత, తమ జీవిత కాలపు పొదుపును వారి చేతిలో పోసి నిలువునా మోసపోయారు.
హైటెక్ బెట్టింగ్.. అడిగితే కత్తుల దాడి
యువత నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను నిందితులు వివిధ అక్రమ క్రికెట్ బెట్టింగ్ యాప్స్‌కు, అంతర్జాతీయ సైట్లకు మళ్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, ఈ మోసాన్ని గమనించి తమ సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగిన బాధితులకు నిందితులు అసలు స్వరూపాన్ని చూపేవారు. కత్తులతో భయపెడుతూ, ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ బాధితుల గొంతు నొక్కేవారు. ఈ దందా కేవలం డబ్బు దోపిడీయే కాదు, కత్తుల నీడలో సాగుతున్న ఒక హింసాత్మక మాఫియా అని ఎస్పీ అజితా వెజెండ్ల వివరించారు.
రూ. 2 కోట్ల రికవరీ.. నెల్లూరు పోలీసుల మెరుపు దాడి
ఈ ముఠా స్థావరాలపై పోలీసులు నిర్వహించిన సోదాల్లో లభించిన సొమ్ము చూసి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుల నుంచి రూ. 34,65,800 నగదును నేరుగా స్వాధీనం చేసుకోగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో రూ. 1,64,74,600 డబ్బును పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో మొత్తం రికవరీ విలువ అక్షరాలా రూ. 2 కోట్లు దాటింది. వీటితో పాటు 13 స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ టీవీలతో పాటు బాధితులను బెదిరించడానికి వాడిన మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మాయలో పడకండి.. ఎస్పీ సీరియస్ వార్నింగ్
ఈజీ మనీ అనేది ఒక విషపూరితమైన వల. అందులో పడితే భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుంది అని ఎస్పీ అజితా వెజెండ్ల యువతను హెచ్చరించారు. అక్రమ ఇన్వెస్ట్‌మెంట్లు, బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, ఎవరైనా ఆశ చూపిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆమె సూచించారు. బుచ్చి కేంద్రంగా సాగుతున్న ఈ భారీ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశామని, అక్రమార్కుల ఆట కట్టిస్తామని ఆమె స్పష్టం చేశారు.
Next Story

