
తల కోసం పోలీసులు గాలింపులు
ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్
ప్రశాంతమైన విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివాహేతర సంబంధం, ఆర్థిక వేధింపుల నేపథ్యంలో ఒక వ్యక్తి తన ప్రియురాలిని కిరాతకంగా హతమార్చి, ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన వైనం కలకలం రేపుతోంది. నిందితుడు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
పథకం ప్రకారం హత్య.. ఫ్రిజ్‌లో మృతదేహం
పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర (35) విశాఖలోని ఎల్.వి.నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితమే పుట్టింటికి వెళ్ళింది. ఇదే తరుణంలో తన స్నేహితురాలు/ప్రియురాలు మౌనిక (29)ను తన ప్లాట్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవీంద్ర ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి, ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.
లొంగిపోయిన నిందితుడు.. తల కోసం గాలింపు
హత్య చేసిన అనంతరం రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎల్.వి.నగర్‌లోని అతడి ప్లాట్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రిజ్‌లో రెండు మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి షాక్‌కు గురయ్యారు. అయితే, మౌనిక తల భాగం అక్కడ కనిపించకపోవడంతో, నిందితుడు దానిని ఎక్కడో పారేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దాని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి.
హత్యకు కారణం ఏంటి?
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు రవీంద్ర కీలక విషయాలు వెల్లడించాడు. మౌనిక తనను నిత్యం డబ్బుల కోసం వేధించేదని, ఆమె పెట్టే హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపాడు. భార్య ఇంట్లో లేని సమయాన్ని చూసి పక్కా ప్లాన్‌తో ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.
కేసు నమోదు - దర్యాప్తు
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ , ఉన్నతాధికారులు ఆధారాలు సేకరించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన విశాఖ వాసులను భయాందోళనకు గురిచేసింది.
Next Story

