నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..
x

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్‌గా పేర్కొన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం


Click the Play button to hear this message in audio format

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా జేవర్‌లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. దేశంలోని అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ విమానాశ్రయ సామర్థ్యం ప్రస్తుతానికి ఏడాదికి సుమారు 12 మిలియన్ ప్రయాణికులు. పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఇది 70 మిలియన్ ప్రయాణికులకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ .. ఉత్తరప్రదేశ్, ఎన్సీఆర్ ప్రజలకు ఎంతో ముఖ్యమని ఈ విమానాశ్రయం, వాణిజ్య కార్యకలాపాలను పెంచడంతో పాటు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

విమానాశ్రయ తొలి దశను సుమారు రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేశారు. యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తోంది. విమానాశ్రయంలో 3,900 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించారు. బోయింగ్ 777-300ER వంటి వైడ్-బాడీ విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ కూడా నిర్వహించగలదు. ఆధునిక ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్ వంటి సదుపాయాలతో అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు సేవలు అందించగల సామర్థ్యం ఉంది.

ఈ విమానాశ్రయం నాలుగు దశల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేక కార్గో టెర్మినల్‌తో పాటు మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించే సామర్థ్యం ఉండగా, భవిష్యత్తులో దీన్ని 18 లక్షల మెట్రిక్ టన్నుల వరకు విస్తరించనున్నారు.

అదనంగా, 40 ఎకరాల్లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (MRO) సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది విమానాల నిర్వహణకు కీలకంగా ఉపయోగపడుతుంది.

కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్‌గా పేర్కొంది. వ్యవసాయం, పరిశ్రమ, లాజిస్టిక్స్ రంగాల్లో ఇది కొత్త అవకాశాలు సృష్టించి, ఉపాధిని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.

Read More
Next Story