
మీరట్‌లో నమో భారత్ – మెట్రో సేవలు ప్రారంభం
పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మీరట్‌లో నమో భారత్ రైలు, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మెట్రోలో ప్రయాణించారు.
ప్రధాని మోదీ ఉదయం హిండోన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర హెలికాప్టర్‌లో శతాబ్ది నగర్ స్టేషన్ సమీపంలోని మోహకంపూర్ హెలిప్యాడ్‌కు చేరుకోగా, కొద్దిసేపటికే ప్రధాని హెలికాప్టర్ కూడా అక్కడ దిగింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి స్వాగతం పలికారు. తర్వాత శతాబ్ది నగర్ స్టేషన్‌లో నమో భారత్ రైలు, మీరట్ మెట్రో సేవలను ప్రధాని ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మోదీ, యోగి ఆదిత్యనాథ్ కలిసి మెట్రోలో మీరట్ సౌత్ స్టేషన్ వరకు ప్రయాణించారు.
అనంతరం ప్రధాని రహదారి మార్గంలో మొహియుద్దీన్‌పూర్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో అభివృద్ధి పనుల ప్రాధాన్యతను వివరించారు. అంతకుముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారు. సభా స్థలంలో సుమారు గంటసేపు గడిపిన అనంతరం, ప్రధాని మొహియుద్దీన్‌పూర్ హెలిప్యాడ్ నుంచి తిరిగి హిండన్ విమానాశ్రయానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవంతో ఢిల్లీ–ఘాజియాబాద్–మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో భాగమైన నమో భారత్ సేవలు మరింత విస్తరించాయి. వేగవంతమైన రవాణా సౌకర్యం ద్వారా ఢిల్లీ–మీరట్ మధ్య ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. స్థిరమైన పట్టణ రవాణా వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

