
‘కాంగ్రెస్ హయాంలో రక్షణ ఒప్పందాల్లో అవినీతి’
హస్తం పార్టీపై ప్రధాని మోదీ ఆరోపణలు
పుల్వామా దాడి జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ భద్రతను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, రక్షణ ఒప్పందాల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో దేశ సరిహద్దులు బలపడటమే కాకుండా శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి సమాధానం ఇస్తోందని పేర్కొన్నారు. గౌహతిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ శక్తిని ప్రపంచం చూసిందని, ఉగ్రదాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించామని అన్నారు. “నేటి భారత్ తన భద్రత కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. సరిహద్దులను బలోపేతం చేయడమే కాకుండా దేశ శత్రువులకు వారి ఇళ్లలోనే సమాధానం ఇస్తోంది” అని మోదీ పేర్కొన్నారు.
రక్షణ కొనుగోళ్లలో అవినీతి..
పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన చర్యలను ప్రపంచం గుర్తించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని, కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. యూపీఏ హయాంలో రక్షణ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
భద్రతను బలోపేతం చేసే దిశగా..
దేశ భద్రతను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సాయుధ దళాలను ఆధునీకరిస్తోందని, సరిహద్దుల్లో అద్భుతమైన రహదారులు, సొరంగాలు, ఎత్తైన వంతెనలు, ఆధునిక వైమానిక స్థావరాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పనులు కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అస్సాం రాష్ట్రానికి పన్ను వాటా విషయంలో కూడా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో అస్సాంకు కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే లభించాయని, బీజేపీ ప్రభుత్వంలో ఈ ఏడాది దాదాపు రూ.50వేల కోట్లు అందుతున్నాయని తెలిపారు. గత 11 ఏళ్లలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5.5 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయని వివరించారు.
ఈశాన్య ప్రాంతాల అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించిందని, హైవేలు, రహదారి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. బ్రహ్మపుత్ర నదిపై నదీ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని, అస్సాం పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రస్తుత స్థాయికి ఎదగడానికి కార్యకర్తల కృషి కారణమని, సంస్థాగత శక్తే మార్పుకు మూలమని మోదీ పేర్కొన్నారు. “భారత్ మాతా కీ జై” అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కాంగ్రెస్ దేశాన్ని విభజించే శక్తులను సమర్థిస్తోందని ఆరోపిస్తూ, ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయాలని నినాదాలు చేసే వారిని ప్రోత్సహిస్తోందన్నారు. స్వాతంత్ర్య సమయంలో దేశాన్ని విభజించిన ముస్లిం లీగ్‌తో పోల్చుతూ, నేటి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

