అస్సాంలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
x

అస్సాంలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు..


Click the Play button to hear this message in audio format

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం అస్సాంలోని సిల్చార్ పట్టణాన్ని సందర్శించి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

సిల్చార్ – షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే..

సిల్చార్ (కాచార్ జిల్లా) నుంచి షిల్లాంగ్ వరకు కలిపే యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 22,864 కోట్లు. ఈశాన్య ప్రాంతంలో ఈ తరహా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఇదే మొదటిసారి.

166 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ .. గువాహటి – సిల్చార్ మధ్య దూరాన్ని 295 కిలోమీటర్ల నుంచి 252 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. దీంతో ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుంచి సుమారు 5 గంటలకు తగ్గుతుందని అధికారులు తెలిపారు.

ఎలివేటెడ్ కారిడార్‌కు భూమి పూజ..

సిల్చార్‌లో ట్రంక్ రోడ్ వద్ద క్యాపిటల్ పాయింట్ నుంచి రంగిర్ఖారి పాయింట్ వరకు జాతీయ రహదారి 306 పై నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు కూడా ప్రధాని భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ వ్యయం రూ. 565 కోట్లు.

ఈ మార్గం సిల్చార్‌లో అత్యంత రద్దీగా ఉండే రహదారులలో ఒకటి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. అలాగే మిజోరం, త్రిపుర, మణిపూర్ వంటి పొరుగు రాష్ట్రాలతో రవాణా అనుసంధానం మెరుగుపడుతుంది.

వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన..

కరీమ్‌గంజ్ జిల్లాలోని పథార్కాండిలో రూ. 122 కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఏప్రిల్‌లో ఎన్నికలు..

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి వరుసగా అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతుండటంతో ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Read More
Next Story