
అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం
రాయిటర్, వాల్ స్ట్రీట్ జర్నల్ కు పైలెట్ల సంఘం నోటీసులు
అహ్మాదాబాద్ విమాన ప్రమాదంపై ఎలాంటి ధృవీకరణ లేకుండా ఊహజనిత సమాచారం ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి రెండు వందల పై చిలుకు ప్రయాణికులతో పాటు, పదుల సంఖ్యలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రమాదానికి కారణం పైలెట్లే అని పాశ్చాత్య మీడియా సంస్థలైన ‘వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్’ వార్తా కథనాలు ప్రచురించడంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్(ఎఫ్ఐపీ) లీగల్ నోటీసులు పంపింది.
వార్తా సంస్థలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఏకపక్షంగా, ఎలాంటి ధృవీకరణ సమాచారం లేకుండా కథనాలు వండివార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎఫ్ఐపీ అధ్యక్షుడు సీఎస్ రంధావా మాట్లాడుతూ.. పైలట్ల సంఘం చట్టపరమైన చర్యను ప్రారంభించిందని, వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ నుంచి క్షమాపణ కోరుతూ లీగల్ నోటీస్ జారీ చేసిందని జాతీయ మీడియాతో చెప్పారు.
సెలెక్టివ్.. ధృవీకరించని అంశాలు..
అంతర్జాతీయ మీడియాలో కొన్ని విభాగాలు ఎంపిక చేసిన, ధృవీకరించని నివేదికల ఆధారంగా కథనాలు ప్రసారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎఫ్ఐఫీ తన నోటీసుల్లో పేర్కొంది.
‘‘అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు పదేపదే ఎంపిక చేసిన కథనాలు ప్రసారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా దర్యాప్తు కొనసాగుతున్నప్పుడూ ఇటువంటి బాధ్యతరహితమైన చర్యలు అర్థరహితమైనవి’’ అని నోటీసుల్లో పేర్కొంది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్రత ఆధారంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారత ప్రజల్లో విమానాయన పరిశ్రమ భద్రత గురించి ప్రజల్లో ఆందోళన సృష్టించడానికి తమకు సమయం లేదని పేర్కొంది.
‘‘ఈ రకమైన ప్రమాదం ప్రజల దృష్టిని, దిగ్బ్రాంతిని కలిగించినప్పటికి ముఖ్యంగా ఆధారం లేని కథనాల ఆధారంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాల్సిన సమయం ఇది కాదు’’ అని నోటీసులో పేర్కొంది.
ఊహజనిత సమాచారం..
అంతర్జాతీయ వార్తా సంస్థలు ఊహజనిత సమాచారం, చాలా బాధ్యతారహితమైన కథనాలతో మరణించిన పైలెట్ల ప్రతిష్టకు భంగం కలిగించి, తిరిగి కోలుకోలేని విధంగా మచ్చ తెచ్చిందని, వారు తమను తాము రక్షించుకోలేరని ఎఫ్ఐపీ నోటీసుల్లో పేర్కొంది.
‘‘అలా చేయడం ద్వారా రాయిటర్స్, బాధిత కుటుంబాలపై అనవసరమైన బాధను కలిగించింది. అపారమైన ఒత్తిడి, ప్రజాబాధ్యతతో పనిచేసే పైలట్ ల ధైర్యం తగ్గించింది’’ అని నోటీస్ లో వివరించింది.
పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని అధికారిక దర్యాప్తు నుంచి నిశ్చయాత్మకమైన ఫలితాలు విడుదలయ్యే వరకూ విమానం ప్రమాదం, పైలెట్లకు సంబంధించిన ధృవీకరించబడని, ఊహజనిత లేదా అనధికారిక సిద్దాంతాలు, కథనాలు వ్యాప్తి చేయడం, విస్తరించకుండా రాయిటర్, దాని అనుబంధ సంస్థలను హెచ్చరించాలని మాకు అనిపించిందని నోటీస్ లో ఎఫ్ఐబీ పేర్కొంది.
రాయిటర్స్ కు సందేశం..
ప్రమాదం వెనకగల కారణాన్ని ఊహించే కంటేంట్ ప్రచురించడం, లేదా ప్రసారం చేయకుండా ఉండాలని, జూలై 17న ప్రచురించిన కథనాన్ని సమీక్షించాలని పైలెట్ల సంఘం తన నోటీసుల్లో రాయిటర్స్ ను కోరింది. రాయిటర్స్ పైలెట్లపై వేసే నిందను ఆపాదించే ఏదైన కంటేంట్ ను తొలగించి తగిన డిస్ క్లైమర్ ను కూడా జత చేయాలంది.
భారత్ లోని కొన్ని వర్గాలు మాత్రం విమాన తయారీదారు అయిన బోయింగ్ సంస్థలోని లోపాలను దాచిపెట్టడానికి పైలెట్లపై నిందలు మోపుతున్నారని, అందుకే వ్యక్తిత్వ హననం చేస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వార్తా కథనాలు రాస్తున్నాయని వారు నేరుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Next Story