‘తమిళనాడు మంత్రుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి’
x

‘తమిళనాడు మంత్రుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి’

నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని సుప్రీంలో పిటిషనర్ వాదన..


Click the Play button to hear this message in audio format

తమిళనాడుకు చెందిన ఇద్దరు కేబినెట్ మంత్రులపై గతంలో ఆదాయానికి మించిన ఆస్తులు (డీఏ) కేసులు నమోదయ్యాయి. అయితే వాటిని వేరే రాష్ట్రంలోని కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో న్యాయమైన విచారణ జరగదన్న అనుమానం ఉందని పిటిషనర్ కళ్యాణ్ రామన్ పిటీషన్‌లో పేర్కొన్నారు.


ప్రస్తుతం విరుదునగర్ జిల్లా ప్రత్యేక కోర్టులో..

తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్‌పై గతంలో నమోదైన డీఏ కేసులు ప్రస్తుతం విరుదునగర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టులో ఉన్నాయి. అయితే వీరు అధికారంలో ఉండడంతో విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్‌లో వాదించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత డీఏ కేసును తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


కేసుల నేపథ్యం..

2006–2011 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో ఇద్దరు మంత్రులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో DVAC (విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ శాఖ) కేసులు నమోదు చేసింది. 2012లో చార్జ్ షీట్లు దాఖలయ్యాయి.

అయితే 2021లో డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చాక అదనపు నివేదికలు సమర్పించడంతో ప్రత్యేక కోర్టులు ఇద్దరు మంత్రులను విడుదల చేశాయి. దీనిపై మద్రాస్ హైకోర్టు 2024లో జోక్యం చేసుకుని విడుదల ఆదేశాలను రద్దు చేసింది. న్యాయ ప్రక్రియ దుర్వినియోగం జరిగిందని వ్యాఖ్యానించింది.


సుప్రీంకోర్టు స్టే..

హైకోర్టు ఆదేశాలను ఇద్దరు మంత్రులు సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ ఆదేశాల అమలుపై స్టే (తాత్కాలిక నిలుపుదల) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విచారణలను తమిళనాడు వెలుపల బదిలీ చేయాలని కొత్త పిటిషన్లు దాఖలయ్యాయి.


పిటిషనర్ వాదనలు..

‘‘హైకోర్టు ఇప్పటికే విచారణలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాదులు రాష్ట్రానికి చెందినవారు కావడం, మంత్రులు అధికారంలో ఉండటం వల్ల దర్యాప్తు సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. క్రిమినల్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.’’ అని పిటిషనర్ న్యాయమూర్తిని అభ్యర్థించారు.

Read More
Next Story