
అమరావతి రాజధానికి శాశ్వత చట్టపరమైన గుర్తింపు
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం సవరణకు పార్లమెంట్‌లో మార్గం సుగమం
ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014కు సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సవరణ చేపట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఈనెల 28న ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం సెక్షన్ 5(2)లో “at Amaravati” అనే పదాలను చేర్చాలని, అలాగే సెక్షన్ 5 వివరణలో “Amaravati includes the capital city areas notified under the A.P. Capital Region Development Authority Act, 2014” అని జోడించాలని కోరారు. ఈ సవరణ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతానికి చట్టపరమైన రక్షణ, స్థిరత్వం లభించనుంది.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర హోం మంత్రి, హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీలకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే ఈ సవరణ ఆమోదం పొందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014లోని సెక్షన్ 5(2)లో ప్రస్తుతం “there shall be a new capital for the State of Andhra Pradesh” అని ఉంది. దీనిని “there shall be a new capital for the State of Andhra Pradesh at Amaravati”గా మార్చడం ద్వారా అమరావతి రాజధాని స్థాయి చట్టపరంగా స్పష్టం చేయనున్నారు. ఇది రాజధాని అంశంపై గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న అనిశ్చితిని తొలగించి, అమరావతి అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సవరణ ఆమోదం పొందితే ఏపీ రాజధాని అమరావతి చట్టపరమైన బలంతో ముందుకు సాగడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది.

